టాలీవుడ్ ఈ వేసవిని సద్వినియోగం చేసుకోలేదన్నది నిజం. ప్రతీ యేటా సమ్మర్ సీజన్లో విరివిగా సినిమాలొచ్చేవి. ముఖ్యంగా బడా హీరోలు వేసవిని టార్గెట్ చేసేవారు. సంక్రాంతి తరవాత ఇదే కీలకమైన సీజన్ కాబట్టి నిర్మాతలూ ఆసక్తిగా ఎదురు చూసేవారు. సంక్రాంతి ఎప్పుడైతే ముగిసిందో, అప్పటి నుంచే వేసవికి ప్రణాళికలు సిద్ధమైపోయేవి. కానీ ఈసారి ఆ హడావుడి లేదు. పెద్ద హీరోలు సైలెంట్ అయిపోయారు. చిన్న, మీడియం రేంజ్ సినిమాల తాకిడి కూడా తగ్గిపోయింది. ఐపీఎల్ కి భయపడి కాస్త, సరైన సమయానికి సినిమాల్ని సిద్ధం చేయలేక మరికొంత, బాక్సాఫీస్ దగ్గర జనాల మైండ్ సెట్ ఏమిటో అర్థం కాక మరికొంత.. వెరసి వేసవికి సరైన సినిమాలే రాలేదు. మే పూర్తవుతున్నా పెద్ద హీరోల అలికిడి లేదు. వస్తాయనుకొన్న సినిమాలు సైతం రిలీజ్ డేట్ లు నిర్దారించుకోలేక సతమతమవుతున్నాయి. వేసవి తరవాత వచ్చే కొన్ని సినిమాలకూ ఈ సందిగ్థత ఉంది.
సంక్రాంతికి రావాల్సిన సినిమా ‘విశ్వంభర’. సంక్రాంతి మిస్ అయితే.. కచ్చితంగా వేసవికి వస్తుందని ఆశించారు. కానీ వేసవి సీజన్ కూడా క్యాష్ చేసుకోలేపోయింది. జులై 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని అంతా అనుకొంటున్నారు. కానీ చిత్రబృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు. వీఎఫ్ఎక్స్ తో ముడి పడి ఉన్న కథ ఇది. సాధారణంగా విజువల్ ఎఫెక్ట్స్ తో పెట్టుకొంటే – రిలీజ్ డేట్లు మన చేతుల్లో ఉండవు. అవుట్ పుట్ వచ్చాక, సరి చూసుకొన్న తరవాత అప్పుడు రిలీజ్ డేట్ ఖరారు చేసుకోవాలి. ‘విశ్వంభర’ పరిస్థితి కూడా అదే. ఒకవేళ జులై 24న రాకపోతే.. అప్పుడు ఆగస్టు 22న విడుదల చేసే అవకాశం ఉంది. యూవీ క్రియేషన్స్ దగ్గర ఈ సినిమాకు పెట్టుబడి పెట్టడానికి సొమ్ము లేదని, అందుకే ఇంత జాప్యం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. దానికి తగ్గట్టే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ కాలేదు.
పవన్ కల్యాణ్ సినిమాల పరిస్థితీ అంతే. ‘వీరమల్లు’ మే 30న తీసుకొస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి ‘వీరమల్లు’ రావడం లేదు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. ‘వీరమల్లు’ వస్తుందని భావించిన ‘కింగ్ డమ్’ మే 30 నుంచి తప్పుకొంది. ఆ సినిమాకీ ఓ కొత్త డేట్ కావాలి. ‘కింగ్ డమ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదని, అందుకే రిలీజ్ డేట్ విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారని టాక్. ‘వీరమల్లు’, ‘కింగ్ డమ్’ మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏది ముందు? ఏది తరవాత? అనేది తేలాలి. మరోవైపు ‘ఓజీ’ షూటింగ్ లో తిరిగి పాలు పంచుకొన్నాడు పవన్. ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ శర వేగంగా పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. సెప్టెంబరులో ఈ సినిమాని విడుదల చేయాలన్నది ప్లాన్. కానీ ఈ షెడ్యూల్ పూర్తయితే కానీ, రిలీజ్ డేట్ పై ఓ స్పష్టత రాదు.
‘రాజాసాబ్’ రిలీజ్ వ్యవహారం కూడా ఇలానే సాగుతోంది. వేసవికి ఏ సినిమా వచ్చినా, రాకపోయినా ‘రాజాసాబ్’ వచ్చి తీరుతుందని అనుకొన్నారు. కానీ ఈ సినిమా విషయంలోనూ క్లారిటీ లేదు. ఈ యేడాది చివర్లో వస్తుందని కొందరు, అసలు ఈ యేడాది విడుదల కావడం కష్టమని మరికొందరు. విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు చాలా బాకీ ఉన్నాయని, రీ షూట్లు జరుగుతున్నాయని టాలీవుడ్ లో చర్చించుకొంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. సంజయ్‌దత్ పై కొన్ని సీన్లు తెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రభాస్ కూడా సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. ఓ టీజర్ కూడా రెడీగా ఉందట. అది రిలీజ్ అయితే.. రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఈ వేసవిలో రావాల్సిన మరో రెండు సినిమాలు ‘ఘాటీ’, ‘మాస్ జాతర’. క్రిష్ దర్శకత్వం వహించిన `ఘాటీ` చిత్రీకరణ పూర్తి చేసుకొంది. కానీ వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే రిలీజ్ వాయిదా పడింది. జులైలో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. రవితేజ హీరోగా నటించిన `మాస్ జాతర` సమ్మర్‌కే రావాలి. కానీ షూటింగ్ సమయంలో రవితేజ ప్రమాదానికి గురి కావడం వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. అందుకే రిలీజ్ డేట్ ఇంకా సందిగ్థంలోనే ఉంది.
ఈ సినిమాలన్నీ క్రేజ్ ఉన్నవే. 2025లో వచ్చే ముఖ్యమైన సినిమాల్లో ఇవి కొన్ని. బాక్సాఫీసు దగ్గర ప్రభావం చూపించగల సత్తా ఉన్న సినిమాలు. అందుకే టాలీవుడ్ అంతా ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటిస్తే, మిగిలిన సినిమాలు కూడా తామెప్పుడు రావాలో డిసైడ్ అవుతాయి. సినిమా సినిమాకి మధ్య గ్యాప్ ఉండాలన్నా, మంచి డేట్లు మిస్ కాకూడదన్నా ఈ చిత్ర నిర్మాతలు రిలీజ్ డేట్ విషయంలో కాస్త క్లారిటీ ఇస్తే మంచిది. లేదంటే అటు బయ్యర్లు, ఇటు అభిమానులు ఇద్దరూ ఇబ్బంది పడాల్సిందే.