కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకునే విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చర్యలను నిలుపుదల చేయాలని కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అకోబర 7వ తేదీకి వాయిదా వేసింది. అంటే దాదాపుగా నెల రోజుల వరకూ హరీష్ రావు, కేసీఆర్లకు ఊరట లభించినట్లే.
కాళేశ్వరం విషయంపై హైకోర్టులో ప్రభుత్వం మెమో సబ్మిట్ చేసింది. విచారణకు తాము సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేశామని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. కమిషన్ తో సంబందం లేకుండా సీబీఐ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. అయితే ఘోష్ కమిషన్ ఆధారంగా దర్యాప్తు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే సీబీఐ దర్యాప్తు చేయవచ్చు కానీ.. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా వద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఇలాంటి న్యాయపరమైన వివాదాలు ఉంటే సీబీఐ వెంటనే చార్జ్ తీసుకుని దర్యాప్తు చేసే అవకాశాలు ఉండవు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలో కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలు వెల్లడి అయినందునే సీబీఐకి సిఫారసు చేశారు. ఇప్పుడు ఆ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని ఆదేశించారు కాబట్టి సీబీఐ తొందరపడకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించినట్లేనని భావిస్తున్నారు.