అంబటి రాంబాబును కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు రిమాండ్ విధించవద్దని వాదించడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. దాంతో ఇక వైసీపీ నేతలు కూడా.. అంబటిని రాజమండ్రికి తరలిస్తారా.. నెల్లూరుకు తరలిస్తారా అని చర్చించుకోవడం ప్రారంభించారు. ఆయన ఇమేజ్ అలాంటిది. పొన్నవోలు కి వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు రిమాండ్ సింహా అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన వాదించి .. బెయిల్ రావాల్సిన వాళ్లను కూడా జైలుకు పంపిస్తారు. చాలా సందర్భాల్లో అదే జరిగింది.
అంబటి రాంబాబుపై పెట్టిన కేసులకు ఆయనకు సంబంధం లేదని పొన్నవోలు కోర్టులో వాదించారు. మరి అదెలానో వాదించాలిగా.. పోలీసులు మొత్తం డీటైల్స్ న్యాయమూర్తికి సమర్పించారు. ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రిని దూషించిన వీడియోలు చూపించారు. ప్రజాగ్రహం చూస్తూంటే ఆయన బయట ఉంటే ప్రమాదమని కూడా చెప్పారు. వీటన్నింటికీ పొన్నవోలు సమాధానాలు ఇవ్వకుండా.. ఏదో సినిమాలో లాయర్ చెప్పినట్లుగా.. కొట్టేయండి సార్.. కేసు కొట్టేయండి అని వాదించారు. ఏ మాత్రం సబ్జెక్ట్ ఉండని ఆయన వాదనలతో.. అంబటి రాంబాబు రాజమండ్రి జైలు చూడాల్సి వచ్చింది.
నిజానికి అంబటి రాంబాబు ఇటీవల లాయర్ అయ్యారు. నల్లకోటు వేసుకుని రెండు, మూడు సార్లు హైకోర్టుకు వెళ్లి ఫోటోలు, వీడియోలు దిగారు. కోర్టు హాల్లోకి వెళ్లి వాదించారో లేదో తెలియదు కానీ.. ఓ సందర్భంలో తన కేసును తానే వాదించుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం పొన్నవోలును ఎందుకు పెట్టుకున్నారో ఆయనకే తెలియాలి. బహుశా ఆయన కూడా .. తాను బయట ఉంటే కష్టమని.. లోపల ఉండటమే మంచిదని అనుకుని ఉంటారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.


