సంపాదిస్తున్న ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు నుంచి మళ్లీ ఆదాయం, ఆస్తి ఉండేలా చూసుకోవాలన్నది ఆర్థిక నిపుణుల సూత్రం. జీవన వ్యయం పరిమితంగా ఉంచుకుని .. భవిష్యత్ కోసం కొంత అట్టిపెట్టుకునే ఖర్చు చేయమని సలహాలిస్తూ ఉంటారు. అందులో భాగంగా మొదట ఇంటి కొనుగోలుకు ఖర్చుచేయాలని చాలా మంది సలహాలిస్తూంటారు. అయితే కాలంతో పాటు ఇప్పుడు పరిస్థితులూ మారుతున్నాయి. ఇళ్ల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇళ్లకు అంత పెద్ద మొత్తంలో పెట్టడం మంచిదేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇప్పుడు కాస్త సౌకర్యాలతో, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ మంచి ఇంట్లో ఉండాలనుకుంటే.. కనీసం కోటిన్నర పెట్టాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడితే సొంత ఇల్లు సమకూరుతుంది. లేకపోతే అద్దె ఇంట్లో ఉండాలి. ఇలాంటి ఇళ్ల అద్దె కనీసం నలభై నుంచి యాభై వేల రూపాయల వరకూ ఉంటుంది. ఇక్కడే చాలా మంది యువత ఆలోచనలు మారిపోతున్నాయి. కోటిన్నర పెట్టి ఇల్లు కొంటే .. ఈఎంఐ లక్షకుపైగా కట్టాలి. డౌన్ పేమెంట్ కట్టాలి. అదే అద్దెకు తీసుకుంటే.. యాభై వేలతో పోతుంది. అంత లోన్ తీసుకుంటే కట్టే వడ్డీ కూడా యాభై వేలు దాటిపోతుంది. అందుకే సొంత ఇల్లు కన్నా అద్దెకు ఉండటం బెటర్ అని అనుకుంటున్నారు.
అయితే ఆర్థిక నిపుణులు ఇక్కడ కొన్ని విషయాలను పరిశీలించాలని చెబుతున్నారు. కోటిన్నర పెట్టి కొన్న ఇల్లు .. పదేళ్ల తర్వాత ఎంత విలువ చేస్తుందన్నది కూడా చూసుకోవాలంటున్నారు. అప్పటికి మూడు కోట్లు అయ్యే ట్రెండ్ ఉంటే… ఇప్పుడు రిస్క్ చేసినా.. నష్టం ఉండదు. ఒక వేళ పెద్దగా విలువ పెరగని ఇల్లు అయితే కొనాల్సిన పని లేదు. అద్దెకు ఉండటమే బెటర్. సొంత ఇల్లు ఉండటం వల్ల అద్దె ఉండదు.. అలాగే విలువ పెరుగుతుంది. ఇలాంటి సమీకరణాలను చూసుకుంటే.. యాభై వేల అద్దె కట్టడం కంటే సొంత ఇల్లు కొనడమే మేలని సూచిస్తూంటారు.
ఇప్పుడు అద్దె ఇల్లే బెటర్ అనుకుంటే పదేళ్ల తర్వాత సొంత ఇల్లు కొనాలనుకుంటే అప్పుడు మూడు కోట్లు అవుతుంది. అంటే పదేళ్లలో కోటిన్నర అదనపు ఖర్చు అవుతుంది. అందుకే.. వైజ్‌గా ఆలోచిస్తే సొంత ఇల్లు కొనుగోలు అనేది మంచి నిర్ణయమే అవుతుందంటున్నారు.