హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కలకలం రేపిన భారతి బిల్డర్స్ వ్యవహారంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించి, అనుమతులు లేకుండానే ప్రీ-లాంచ్ పేరుతో వందలాది మంది నుంచి నిధులు వసూలు చేసినందుకు గానూ, సదరు సంస్థను డిఫాల్టర్ ప్రమోటర్ గా ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో దాదాపు 400 మంది కొనుగోలుదారుల నుండి సుమారు రూ. 70 కోట్ల వరకు వసూలు చేసినట్లు తేలడంతో, ఆ సంస్థపై ఏకంగా రూ. 4.74 కోట్ల భారీ జరిమానా విధిస్తూ రెరా సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
డబ్బులు కట్టిన వారికి ఊరట లభిస్తుందా?
బాధితులకు సంబంధించి రెరా వెలువరించిన తీర్పు అత్యంత కీలకం. ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం లేదని గుర్తించిన అథారిటీ, కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేయాలని బిల్డర్ను ఆదేశించింది. ఈ మొత్తాన్ని ఆర్డర్ వచ్చిన 60 రోజుల్లోగా బాధితులకు చెల్లించాలని స్పష్టం చేసింది. ఒకవేళ బిల్డర్ ఈ నిధులను చెల్లించడంలో విఫలమైతే, వారిపై రెవిన్యూ రికవరీ చట్టం ద్వారా ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
నిబంధనల ఉల్లంఘనలు ఇవే..
కొంపల్లిలోని భారతి లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు విషయంలో బిల్డర్ కనీస నిబంధనలను పాటించలేదని రెరా విచారణలో తేలింది. HMDA అనుమతులు గానీ, బిల్డింగ్ పర్మిషన్లు గానీ లేవు. పైగా, రెరాలో ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ చేయకుండానే అమ్మకాలు సాగించారు. 2021లో నిధులు వసూలు చేసినా, ఇప్పటికీ పునాది పనులు కూడా పూర్తి చేయలేదు. ఇవే కాకుండా, భానుర్లోని ప్రాజెక్టు భూములను బాధితులకు తెలియకుండానే ఇతరులకు బదలాయించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
మరింత కఠినంగా రెరా చర్యలు
ఈ ప్రాజెక్టులో శ్రీ భారతి బిల్డర్స్ కూడా భాగస్వామిగా ఉన్నందున, అందరూ కలిసి సంయుక్తంగా ఈ రీఫండ్ బాధ్యతను మోయాలని రెరా ఆదేశించింది. సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ లో ఇప్పటికే దీనిపై కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలతో భవిష్యత్తులో ప్రీ-లాంచ్ ఆఫర్ల బుట్టలో పడి సామాన్యులు మోసపోకుండా ఉండాలని, రెరా రిజిస్ట్రేషన్ లేని ఏ ప్రాజెక్టులోనూ పెట్టుబడులు పెట్టవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.


