ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీని తీసుకు రావాలని నిర్ణయించింది. ఇందులో గీత కార్మికులకు పది శాతం బార్లు కేటాయించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మద్యం దుకాణాల్లో పది శాతం గీత కార్మికులకు కేటాయించారు. సంప్రదాయంగా కల్లు గీత వృత్తిలో ఉన్న వారు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. అదే సమయంలో కల్లు లభ్యత తగ్గిపోతోంది. తాటి చెట్లు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో ఇంకా ఆ వృత్తిని నమ్ముకుని ఉన్న వారికి ఈ అవకాశం కల్పించడం ద్వారా ఆర్థిక భద్రత కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు.
మద్యం దుకాణాలు పది శాతం వారికి కేటాయించారు. వారికి ప్రత్యేకంగా లైసెన్స్ ఫీజులు నిర్ణయించారు. ఇతర దుకాణాలతో పోలిస్తే తక్కువ నిర్ణయించారు. ఇప్పుడు బార్లు కూడా అలాగే కేటాయిచే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ లిక్కర్ అమ్మకాలు తగ్గకూడదన్న ఉద్దేశంతో బార్లను నిర్వహించలేని విధంగా ఫీజుల మోత మోగించారు. బార్ కు వెళ్లి ఒక్క పెగ్గు తాగితే వెయ్యి రూపాయలు చెల్లించాల్సినంతగా ధరలు పెట్టారు. అందుకే ఏపీలో ఏ ఒక్క బార్ లోనూ జనం కనిపించేవారు కాదు.
ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని నిర్ణయించారు. మంత్రివర్గ ఉపసంఘం బార్లకు ఎలా అనుమతులు ఇవ్వాలన్నదానిపై నిర్ణయం తీసుకునుంది. ఆ ప్రకారం మరింత సరళమైన నిబంధనలతో గీత కార్మికులకు లైసెన్సులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లైసెన్స్లు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కల్లుగీత కార్మికులే ఈ బార్లను స్వయంగా నిర్వహించుకునేలా చేస్తే వారు ఆర్థికంగా స్థిరపడతారు. ఈ వ్యాపారంలో అనుభవం సంపాదిస్తారు.