నిజమో కాదో తెలియని ఓ కేసు పెట్టి.. జైలుకు పంపేసి.. ఓ ముఖ్యమంత్రిని పదవీచ్యుతుడిని చేసేయచ్చు. ఇది కేంద్రం పార్లమెంట్ లో పెట్టిన చట్టంలోని కీలక అంశం. ఇందులో ప్రధాన మంత్రి పేరు కూడా ఉంది. కానీ ప్రధానమంత్రిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సాధ్యమేనా?. నిజంగా తప్పు చేసినా… కేసు పెట్టి అరెస్టు చేయాలనుకుంటే.. ఆ దర్యాప్తు అధికారి క్షణాల్లో శంకరగిరి మాన్యాలకు పోతాడు. ఏ వ్యవస్థ కూడా రక్షించలేదు. అలాంటి పరిస్థితి మన దేశంలో ఉంది. కానీ ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయగలవు. ఎవరూ అడ్డుకోలేరు. ఇది ఒక్కటి చాలు ఆ చట్టంతో వచ్చే అత్యంత ప్రమాదం ఏమిటో సులువుగా అర్థం చేసుకోవచ్చు.
దుర్వినియోగం అవడానికే ఎక్కువ అవకాశం !
కేంద్రం లోక్ సభలో ప్రవేశ పెట్టిన పదవీచ్యుతి బిల్లు దుర్వినియోగానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏ పార్టీకి రాజకీయ అధికారం శాశ్వతం కాదు. ఇవాళ బీజేపీ తనకు ఎదురు లేదని ఇలా రాజ్యాంగసవరణ చేయవచ్చు. కానీ రేపు ప్రభుత్వం మారితే.. బీజేపీ పార్టీకి ఉన్న ముఖ్యమంత్రులపైనే ఈ చట్టాన్ని ప్రయోగించడం పెద్ద విషయం కాదు. ఈ చట్టం సాయంతో ముఖ్యమంత్రుల్ని పదవీచ్యుతుల్ని చేసి.. చాలా సులువుగా ప్రభుత్వాలను స్విచ్ చేయడానికి రాజకీయం రెడీగా ఉంటుంది. ఈ చట్టం వల్ల ఏదైనా ఒకే రాజకీయ పార్టీ రాజకీయం చేయవచ్చని అనుకుంటుందేమో కానీ.. అదే భవిష్యత్ లో తమకూ జరుగుతుదంని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను బలహీనం చేసే బిల్లు.
ఫిరాయింపుల నిరోధక చట్టం లోపాలతో తెచ్చిన కాంగ్రెస్ – ఇప్పుడు బలవుతోంది !
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ ఇలాగే దుర్వినియోగం చేసేందుకు లోపాలతో తీసుకు వచ్చింది. చట్టం అంతా చేసి.. చివరికి అధికారం స్పీకర్ చేతిలో పెట్టింది. స్పీకర్ గా ఎవరు ఉంటారు ?. అధికార పార్టీకి చెందిన ఎంపీ లేదా ఎమ్మెల్యే ఉంటారు. ఆయన చేతుల్లో పెట్టడం వల్ల అధికార పార్టీ మాత్రమే ఫిరాయింపులకు పాల్పడే అవకాశం ఇచ్చినట్లయింది. దాన్ని కాంగ్రెస్ విచ్చలవిడిగా వాడుకుంది. అధికారం పోయాక ఇప్పుడు బాధితురాలిగా మారింది. గగ్గోలు పెట్టింది. ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు కేంద్రం తీసుకు వచ్చిన పదవీచ్యుతి చట్టం కూడా అలాంటిదే. ఇప్పటికి బీజేపీకి మేలు చేయవచ్చు కానీ భవిష్యత్ లో ఆ పార్టీకి పెనుగండంగా మారుతుంది.
దుర్వినియోగం అయ్యే చట్టాలు రాజకీయ వ్యవస్థకే ప్రమాదం !
భారత రాజ్యాంగాన్ని నిర్మాతలు అత్యంత పకడ్బందీగా రూపొందించారు. కానీ రాను రాను పాలకులు తమకు అధికారం శాశ్వతం కావాలనో..ఇతర పార్టీలను నిర్వీర్యం చేయాలనో సవరణలు చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర సంకేతాలు. ఇలాంటి చట్టాల వల్ల ఏ ఒక్క పార్టీకి మేలు జరుగదు. అన్ని పార్టీలు.. నష్టపోతాయి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అదీ కూడా వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి ఇతర పార్టీలను వేధించవచ్చు. కానీ అధికారం పోయిన నాడు తాము కూడా అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. అందుకే రాజకీయ పార్టీలు ఇలాంటి తప్పుడు సంప్రదాయాలను చట్టాలను మార్చకూడదు. భవిష్యత్ కూడా ఆలోచించాలి. వ్యవస్థలను బలోపేతం చేయాలి కానీ బలహీనం చేయకూడదు.