ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్ సిటీ అధారిటీ భవనానికి, ఓ ప్రధానమైన రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ మీద కొంత మంది అనవసర విమర్శలు చేస్తున్నారని.. పదేళ్ల సమయం ఇవ్వండి.. ఫ్యూచర్ సిటీని నిర్మించి చూపిస్తామన్నారు. తనకు భూములు ఉన్నాయని ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నానని, రియల్ ఎస్టేట్ కోసం నిర్మిస్తున్నానని అంటున్నారని మండిపడ్డారు.
నాడు వైఎస్ఆర్, చంద్రబాబు విమర్శలను పట్టించుకుని ఉంటే ఈనాడు హైటెక్ సిటీ , సైబరాబాద్ ఉండేవి కాదన్నారు. వారు ఆలోచన చేశారు కాబట్టే నేడు ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామన్నారు. ఇంకెన్నాళ్లు విదేశాల గురించి చెప్పుకుంటామని ప్రశ్నించారు. భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీ నిర్మాణమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాదిలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. అందుకే మచిలీపట్నం నుంచి పన్నెండు వరుసల రహదారిని ఫ్యూచర్ సిటీకి నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే అమరావతికి అనసంధానించేలా ఫ్యూచర్ సిటీ ఉంటుందని తెలిపారు.
డిసెంబర్‌కు ఫ్యూచర్ సిటీ అధారిటీ భవనాన్ని పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభిస్తామని రేవంత్ తెలిపారు. సింగరేణికి పదెకరాల భూమిని కేటాయిస్తామని ఏడాదిలో కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్కిల్ వర్శిటీ కూడా డిసెంబర్ కల్లా పూర్తవుతుందన్నారు. మరో వైపు ఫ్యూచర్ సిటీ శంకుస్థాపనపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ముందు ఉన్న సిటీ గురించి పట్టించుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ కోసమే.. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ హడావుడి చేస్తున్నారన్నారు.