అజహరుద్దీన్‌కు మైనార్టీ శాఖనే కేటాయిస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ప్రమాణం చేసిన ఆయన హోం శాఖను కేటాయిస్తారన్న ప్రచారం జరిగింది. హోంశాఖ, విద్యాశాఖ రెండూ ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయి. వాటికి ప్రత్యేకమైన మంత్రి ఉండాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో హైకమాండ్ వద్ద ఉన్న పలుకుబడితో అజహర్ హోంశాఖను తెచ్చుకుంటారని అనుకున్నారు.
కానీ అటు హోంశాఖను కానీ..ఇటు విద్యాశాఖను కానీ వదులుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా లేరు. అందుకే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖను.. అలాగే తన వద్ద ఉన్న పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మంత్రిగా ఎలాంటి అనుభవం లేని అజహర్‌కు కీలక శాఖలు అప్పగిస్తే సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో పాటు… మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించడం వల్ల..ఆయన మైనార్టీ వర్గాలతో టచ్ లో ఉంటారని..ఆ వర్గ ప్రతినిధిగా ఉంటారన్న ఉద్దేశంతో ఆ శాఖను కేటాయించినట్లుగా భావిస్తున్నారు.
అజహర్ చాలా వ్యవహారాలతో తీరిక లేకుండా ఉంటారు. ఆయనకు ఇంటర్నేషనల్ కరికెటర్ గా పేరు ఉంది. ..కానీ రాజకీయ నాయకుడిగా ఆయన సాధించిన విజయాలు పెద్దగా లేవు. మొరాదాబాద్ ఎంపీగా చేసినా తనదైన ముద్ర లేదు. ఇప్పుడు మంత్రిగా ఆయన ఏం చేయగలరన్నది కూడా ఆసక్తికరంగానే మారింది. తన శాఖ ద్వారా మైనార్టీలకు వీలైనంత మేలు చేయకపోతే.. కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టమే.
