ఆరు నెలలు సాధన చేసి మూలనున్న ముసలమ్మను కొట్టారని సామెత. కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి.. సీఎం రేవంత్ రెడ్డిని పదుల సార్లు ఢిల్లీ పిలిపించుకుని కసరత్తు చేసి చివరికి మూడు మంత్రి పదవుల్ని భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకమాండ్ నుంచి సమాచారం రావడంతో ఆదివారం ప్రమాణ స్వీకారం చేయిస్తారని కాంగ్రెస్ లోని అత్యున్నత వర్గాలకు సమాచారం అందింది. రాజ్ భవన్ కు తెలియచేసి మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేయాలని కోరినట్లుగా చెబుతున్నారు.
ఆ ముగ్గురు మంత్రులు ఎవరు అన్నదానిపై స్పష్టత లేదు. రెడ్డి సామాజికవర్గంలో పోటీ తీవ్రంగా ఉండటంతో వారిలో ఎవరికీ అవకాశం కల్పించడం లేదని చెబుతున్నారు. బీసీ, ఎస్సీ వర్గాల వారికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రేటర్ పరిధిలో మంత్రులు లేరు. కనీసం ఉమ్మడి జిల్లాకు ఓ మంత్రి పదవి కేటాయించకపోతే సమీకరణాలు సరిగ్గా ఉన్నట్లు కాదు. అందుకే.. ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రేటర్ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించే చాన్స్ ఉంది.
మూడు మంత్రి పదవుల్నిఖాళీగా ఉంచడం వల్ల భారీగా ఆశలు పెట్టుకున్న వారు తర్వాత అయినా అణిగిమణిగి ఉండేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్టీ పదవుల్ని.. నామినేటెడ్ పోస్టుల్ని సోమవారం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ అంశంపై రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.