18 ఏళ్లకే ఓటు వేసే హక్కును రాజీవ్ గాంధీ కల్పించారని కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం పాతికేళ్ల నిబంధన ఉందని దాన్ని మార్చాల్సి ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. 21 ఏళ్లకు ఎన్నికల్లో పోటీ చేసేలా రాజ్యాంగసవరణ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. యువతతో సమావేశమైనప్పుడల్లా ఈ వాదన తీసుకు వస్తున్నారు. అయితే రేవంత్ చెబుతున్నారు కానీ.. ఈ అంశంపై పెద్దగా ఎక్కడా చర్చ జరగడంలేదు. దీనికి కారణం.. అలా ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత వయసు తగ్గిస్తే వారసులు ఇంకా వేగంగా తెరపైకి వస్తారు కానీ.. రాజకీయాల్లో చేరాలనుకునే యువత కాదు .. ఓ పార్టీలో సామాన్యంగా ఎదగడానికి దశాబ్దాలు పడుతుంది. అందుకే యువత కూడా రేవంత్ రెడ్డి డిమాండ్ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చర్చించడం లేదు.
చిన్న వయసు ఎమ్మెల్యేలు వారసులే !
ఎమ్మెల్యేగా పోటీ చేసేవారిలో యువత కూడా ఉంటున్నారు. వయసు కారణంగా పోటీ చేయలేకపోతున్నారు అని ఎవరైనా బాధపడుతున్నారా అంటే అది వారసులే. తెలంగాణలో ప్రస్తుతం ముగ్గురు చిన్న వయసు అంటే 30 ఏళ్లలోపు ఎమ్మెల్యేలు ఉన్నారు. నారాయణపేట నుంచి పర్ణికా రెడ్డి, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు, పాలకుర్తి నుంచి యశస్వినిరెడ్డి. ఈ ముగ్గురూ రాజకీయాల్లో ఎదిగిన వారు కాదు. వారి కుటుంబాలకు వచ్చిన అవకాశం వల్లనే పోటీ చేసి గెలిచారు. ఇరవై ఒక్క ఏళ్లకు వయసు తగ్గిస్తే ఇంకా ఇంకా ఎక్కువ వారసులు బరిలోకి వస్తారు.
లీడర్లు ప్రజల నుంచే రావాలి.. !
ప్రజలను పరిపాలించేవాళ్లు ప్రజల నుంచే రావాలి. రాజకీయ కుటుంబాల నుంచి కాదు. ఒకరి తర్వాత ఒకరు వారి కుటుంబాల నుంచే ఎన్నికవుతూ ఉంటే.. అదే తమ వ్యాపారం అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు అదే జరుగుతుంది. రాజకీయ నేతల కుటుంబాలు అంత లగ్జరీగా ఎలా బతుకుతాయో అందరికీ తెలుసు.కానీ వారికి ఓట్లు వేస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు మారడం లేదు. వారు ఇప్పటికీ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం రాజకీయ నేతల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. వాటిని వారు పరిష్కరించి.. చూశారా మేము ఎంత ఎంత సాయం చేశామో అన్నట్లుగా బిల్డప్ ఇస్తూంటారు. ఇలాంటివి కాదు… ప్రజల జీవితాలను మార్చే రాజకీయం రావాలంటే.. ప్రజల నుంచి రావాలి.
రాజకీయానికి పరిణితి కూడా చాలా ముఖ్యం!
ఓటు వేయడం.. ప్రజా ప్రతినిధిగా వ్యవహరించడం రెండూ ఒకటి కాదు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ప్రజా ప్రతినిధిగా వ్యవహరించడం అంటే ప్రధానంగా చట్టాలు చేసే పనిని చేయాలి. ఆ చట్టాలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అసెంబ్లీలో విరివిగా చర్చించాల్సి ఉంటుంది. అంటే దానికి తగ్గ పరిణితి, అవగాహన ఉండాలి. ఎమ్మెల్యే లేదా మరో ప్రజాప్రతినిధి పదవి ఏదైనా గురుతరమైనది. దానికి తగ్గ హుందాతనం ఉండాలి. అందుకే.. రాజ్యాంగ నిర్మాతలు కనీసం పాతికేళ్ల గడువు విధించారు. ఈ నిబంధన వల్ల ఎలాంటి నష్టం జరగడం లేదు. జరుగుతోందన్న అసంతృప్తీ లేదు. అలాంటప్పుడు మార్పు గురించి చర్చ ఎందుకు?
