తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల్లో పీహెచ్డీలు చాలా చేశారు. ఇతర పార్టీలను ఇరుకున పెట్డడానికి ఆయన చేసే డిమాండ్లు అలాగే ఉంటాయి. కులగణనపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకంటూ ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఓ ప్రెస్మీట్ పెట్టారు. అందులో ఉపరాష్ట్రపతి పదవిని దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పదవికి ..బీసీలకు లింక్ పెట్టేశారు.
దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా బీసీలను గౌరవించినట్లుగా అని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించినట్లుగా అని రేవంత్ చెబుతున్నారు. అదే సమయంలో బీసీల నాయకత్వాన్ని అణిచివేస్తున్నారని బండి సంజయ్ పేరును కూడా ప్రస్తావించారు. బీసీలకు పెద్ద పీట వేసేందుకు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఇండి కూటమి పార్టీలతో తానే మాట్లాడి మద్దతు పలికేలా చూస్తానని కూడా ప్రకటించారు.
రేవంత్ డిమాండ్ బీజేపీ ఇబ్బందికరమే అనుకోవచ్చు. ఎందుకంటే.. ఉపరాష్ట్రపతి పదవి విషయంలో చాలా పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి కానీ దత్తాత్రేయ పేరు లేదు. ఆయన రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లకు గవర్నర్ గా చేశారు. పదవి కాలం ముగిసింది. అయితే బీజేపీ నేతల్ని పావులుగా వాడుకుని.. బీసీల విషయంలో బీజేపీని టార్గెట్ చేయడం రేవంత్ కే సాధ్యమనుకోవాలి.