తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో సాధించిన ఊపును కొనసాగిస్తూ, పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ హవా తగ్గలేదని నిరూపించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. షెడ్యూల్ ప్రకటించక ముందే జనంలోకి వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
స్వయంగా వ్యూహ రచన
మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను రేవంత్ రెడ్డి పూర్తిగా తీసుకున్నారు. కష్టపడే నేతల్ని ఎంపిక చేసుకుని జిల్లాల వారీగా బాధ్యతలు ఇచ్చారు. ప్రతి ఉమ్మడి జిల్లా పర్యవేక్షణ బాధ్యతను ఒక మంత్రికి అప్పగించడమే కాకుండా, పట్టణాల్లో గెలుపు గుర్రాలను వెతకాలని ఆదేశించారు. వార్డు వార్డుకు తిరగాలి.. విజయ బావుటా ఎగరాలి అనే నినాదంతో కింది స్థాయి కార్యకర్తలను సైతం సమాయత్తం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనను ప్రధానంగా ప్రచారం చేయాలని సూచించారు.
గెలిచే అభ్యర్థులకే అవకాశాలు
పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల పార్టీ ఓడిపోవడానికి పార్టీ నేతలు తమ బంధువులకు అవకాశాలు కల్పించడమేనని విశ్లేషణలో తేల్చారు. మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి తప్పు జరగకుండా రేవంత్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తూ, స్థానిక నేతలకు సీరియస్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను తన ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావిస్తున్నారు. అందుకే, తాను దావోస్ వెళ్లడానికి ముందే ప్రచార జోరును పెంచాలని భావిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో భారీ బహిరంగ సభలు నిర్వహించి, విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మున్సిపాలిటీల్లో పాగా వేయాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి టార్గెట్లు విధించారు.
ఏ క్షణమైనా షెడ్యూల్
రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించి వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరుగుతోంది. జనవరి 20వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి మూడో వారంలోగా పోలింగ్ ముగించి, నెలాఖరుకల్లా కొత్త పాలక మండళ్లు కొలువుదీరేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
