కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ చేసిన అవకతవకలు అన్నింటినీ అన్ని విధాలుగా ప్రజల్లో చర్చ పెట్టి, కేసీఆర్ తప్పు చేశారని అందరికీ అనిపించేలా చేసి.. ఆ తర్వాతే కేసీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. అందుకే రిపోర్టును వేగంగా కేబినెట్ లో ఆమోదింప చేసి అందులో ఉన్న మెయిన్ పాయింట్లను మంత్రుల ద్వారా ప్రజల ముందు పెట్టారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ మార్పు దగ్గర నుంచి అప్పుల వరకూ ప్రతీ దాంట్లోనూ కేసీఆర్ తప్పే ఉందని నివేదికలో ఉన్న విషయాన్ని మంత్రి ఉత్తమ్ బయట పెట్టారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత .. ఈ ఘోరంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయిస్తామని అది కూడా సభ్యుల అంగీకారం ప్రకారమే ఉంటుందని సీఎం రేవంత్ తెలిపారు. అసెంబ్లీలో.. శాసనమండలిలో సభ్యులందరికీ..కమిషన్ రిపోర్టు ఇస్తామన్నారు. కేసీఆర్ కూడా రిపోర్టు ఇస్తామని.. సమగ్రంగా ఆయన కూడా అసెంబ్లీకి వచ్చి తన వాదన వినిపించవచ్చని చెప్పారు. అసెంబ్లీలో సమగ్ర చర్చ ద్వారా కాళేశ్వరంలో ఎన్ని అక్రమాలు, అవినీతి జరిగిందో ప్రజలందరికీ చెప్పి ఆ తర్వాత కేసీఆర్ , హరీష్ రావు, ఈటల రాజేందర్ తో పాటు కమిషన్ సిఫారసు చేసిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తదుపరి వచ్చే సమావేశాల్లోనే ఈ అంశాన్ని చేపట్టనున్నారు.
మరో వైపు ఈ నివేదికతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. హరీష్ రావు డ్యామేజ్ కంట్రోల్ కు రంగంలోకి దిగారు. మంగళవారమే తెలంగాణ భవన్ లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో ఉన్న అంశాలకు కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. హరీష్ రావు ప్రెస్ మీట్‌ను తెలంగాణ వ్యాప్తంగా తెరలు పెట్టి ప్రసారం చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.