తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ పార్టీ నేతలకు గాంధీభవన్లో హితబోధ చేస్తున్న సమయంలో దేవుళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఎంతో ఇంపుగా వినిపిస్తున్నాయి. ఇదే.. ఇదే చాన్స్ కోసం చూస్తున్నామని రెడీ అయ్యారు. హిందువులారా మేల్కోండి అని ఇక ఉద్యమం చేయడానికి బండి సంజయ్కూ మంచి అవకాశం లభించింది. పెద్దగా పని లేకుండా ఉన్న బీజేపీ నేతలకు.. రేవంత్ రెడ్డి తీరిక లేకుండా ఉద్యమాలు చేసుకునేంత అవసరమైన స్టఫ్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అదే జోరుగా సాగనుంది.
మూడు కోట్ల దేవుళ్ల గురించి మాట్లాడిన రేవంత్
కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఏకాభిప్రాయం ఉండదని.. ఒకరకు ముందుకెళ్తూంటే..మరొకరు కాళ్లల్లో కట్టెలు పెడుతూంటారని.. అయినా అన్నింటినీ దాటుకుని వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు హితబోధ చేశారు. ఇలా చెబుతున్న సమయంలో మనకు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని.. పెళ్లి కాని వాళ్లకు..రెండు పెళ్లిళ్లు చేసుకునేవాళ్లకు..మాంసాహారం తినేవాళ్లకూ.. ఇలా తమకు ఇష్టమైన అలవాట్లు పెట్టుకున్న అందరికీ దేవుళ్లు ఉన్నారన్నారు. ఇలా దేవుళ్ల విషయంలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు రాజకీయ నేతల విషయంలోనూ ఉండదన్నారు. ఈ ఉదాహరణలో ..దేవుళ్లను అవమానించినట్లుగా మాటలు ఉన్నాయని బీజేపీ నిర్దారించుకుని రంగంలోకి దిగిపోయింది.
హిందూ సమాజానికి పిలుపునిచ్చేసిన బండి సంజయ్
ఇలాంటి అవకాసాలు ఎప్పుడు వచ్చినా.. బండి సంజయ్ పక్కాగా వియోగించుకుంటారు. అందుకే వెంటనే రంగంలోకి వచ్చారు. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని రేవంత్ రెడ్డి తేల్చేశారన్నారు. నరనరాల్లో హిందూ ద్వేషం నింపుకున్నారని..గతంలో కేసీఆర్ హిందూగాళ్లా…బొందూగాళ్లా అని అవ హేళన చేశారన్నారు. అందుకే జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ గెలిస్తే హిందువులు తలెత్తుకుని బయట తిరగలేని ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించామని.. సీఎం వ్యాఖ్యలను చూశాక ఇదే నిజమని తేలిపోయింది. హిందూ సమాజం ఇకనైనా ఆలోచించుకోవాలి. ఓట్ల కోసం చీలిపోయి విడివిడిగా ఉంటూ అవహేళనను, అవమానాన్ని దిగమింగుకుంటూ ఉంటారో….లేక ఏకమై హిందువుల సత్తాను చాటుతారో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
రోడ్డెక్కి ఆందోళనలు చేయడానికి రెడీ !
సీఎం రేవంత్ ను హిందూ వ్యతిరేకిగా మార్చి..కాంగ్రెస్ పార్టీ విషయంలో దూకుడుగా వెళ్లేందుకు బీజేపీ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో ఈ వివాదం చుట్టూనే రాజకీయం జరగనుంది. భారత రాష్ట్ర సమితి తెలంగాణ సెంటిమెంట్ ను గుర్తు చేసి మళ్లీ బలపడదామని అనుకుంటున్న సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యల ద్వారా హిందూ సెంటిమెంట్ ను.. బీజేపీ అందిపుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి అన్యాపదేశంగా ఈ మాటలన్నారో.. కావాలని అన్నారో కానీ.. స్తబ్దుగా ఉన్న బీజేపీకి మంచి ఆయుధం ఇచ్చారు. ఎంత ఉపయోగించుకుంటారో ఇక వారి చేతుల్లోనే ఉంటుంది.
