జూబ్లిహిల్స్ ఉపఎన్నిక బాధ్యతను రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకున్నారు. ఒక్క చిన్న అవకాశాన్ని వదిలి పెట్టకుండా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించడానికి ఆయన తనదైన వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రచారంతో పాటు.. పోల్ మేనేజ్మెంట్ను కూడా పక్కాగా ఫాలో అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డివిజన్ల వారీగా నమ్మకస్తులైన నేతలను ఇంచార్జులుగా పెట్టారు. వారందరికీ టార్గెట్లు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కు పడతాయి అన్న ఓట్లు పడేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.
రేవంత్ విస్తృత ప్రచారం
జూబ్లిహిల్స్ లో తానే అభ్యర్థి అన్నంతగా రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. జూబ్లిహిల్స్ ఓటర్ల వర్గాల లెక్కలు ఇప్పటికే తీసిన ఆయన .. వారిని ఎలా ఆకట్టుకోవాలో పక్కా ప్రణాళికలు వేశారు. మజ్లిస్ మద్దతుతో మైనార్టీలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. అలాగని వారికి తాయిలాలు ప్రకటించకుండా ఉండాలనుకోవడం లేదు. ఇతర ప్రాంతాల్లో మైనార్టీ కార్యక్రమాల్లో పాల్గొని వరాలు ప్రకటించనున్నారు. సినీ కార్మికులకు ఇప్పటికే గిలిగింతలు పెట్టేశారు. కమ్మ సామాజికవర్గ నేతల్ని పిలిపించుకుని సమస్యలు విన్నారు. ఇతర వర్గాల విషయంలో లోపాయికారీగా చేయాల్సినవి చేస్తున్నారు. ఇక యువతను ఆకట్టుకోవడానికి.. నవీన్ యాదవ్ కు తన మద్దతు పుష్కలంగా ఉంటుందని చెప్పడానికి రోడ్ షోలు.. ర్యాలీలు నిర్వహించబోతున్నారు.
పోల్ మేనేజ్ మెంట్ పై ప్రత్యేక దృష్టి
కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన ఓటర్లను గుర్తించి.. వారిని పోలింగ్ బూత్ల వద్దకు తీసుకు రావడానికి రేవంత్ ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నారు. ఇదే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూతులు, డివిజన్లు వారీగా ఇంచార్జుల్ని నియమించారు. పోలింగ్ బూత్ల స్థాయిలో ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక బృందాలను రప్పించి.. గ్రూపులుగా విభజించి ఓటర్లను కలిసే ఏర్పాట్లు చేశారు. ఒక్కో ఓటర్ను కనీసం మూడు సార్లు కలిసి ఓటు అడిగేలా ఏర్పాట్లు చేశారు. నిర్లక్ష్యం చేయకుండా వారంతా ప్రచారం చేసేలా.. పర్యవేక్షణ టీంను కూడా రెడీ చేశారు. బీఆర్ఎస్ చేసే రౌడీ ప్రచారం, పథకాల వైఫల్యం.. పాలనా వైఫల్యం వంటి ప్రచారం ప్రజల్లోకి వెళ్లకుండా.. తామే దూకుడుగా ఉండేలా చూసుకుంటున్నారు.
మొత్తం బాధ్యత తానే తీసుకున్న సీఎం
గెలిచిన తర్వాత గెలిపించింది మేమే అని చెప్పడానికి చాలా మంది రెడీగా ఉంటారు. కానీ ఓడించడానికి కూడా కొంత మంది కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి పలుకుబడి హైకమాండ్ వద్ద తగ్గిపోతుందని అందుకే బీఆర్ఎస్ పార్టీ గెలిచేలా కొంత మంది కాంగ్రెస్ నేతలు తెర వెనుక వ్యూహాలు పన్నుతున్నారన్న ప్రచారమూ ఉంది. అందుకే రేవంత్.. తానే స్వయంగా లీడ్ తీసుకుంటున్నారు. గెలిచినప్పుడు క్రెడిట్ తీసుకోవడానికి చాలా మంది వస్తారు కానీ.. ఓడితే మాత్రం.. బాద్యత అంతా రేవంత్ మీదే వేస్తారని ఆయనకు తెలుసు. అందుకే పూర్తి దృష్టి పెట్టారు.
