ఒకప్పుడు ఉద్యోగ సంఘాలు అంటే ప్రభుత్వాలకు సైతం గౌరవం ఉండేది. ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సినంత పరిస్థితి కల్పించకుండా చూసుకునేనేవి. వారు రోడ్డెక్కితే వీలైనంత వరకూ చర్చలతో పరిష్కరించేవారు. సమ్మె చేసినా కఠిన చర్యలు తీసుకునేందుకు సాహసించేవారు కాదు. కానీ ఇప్పుడు.. ప్రభుత్వాలు ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. తమ హక్కులు అని నోరు తెరవలేకపోతున్నారు. దీనికి కారణం ప్రభుత్వాలుకాదు.. ఉద్యోగ సంఘాల నేతలు. సొంత ప్రయోజనాల కోసం ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టిన ఉద్యోగసంఘనేతలే.
తెలంగాణలో సమ్మె అంటూ హడావుడి చేయాలనుకున్న ఉద్యోగ సంఘాలకు రేవంత్ రెడ్డి గట్టి క్లాస్ ఇచ్చారు. సమరం అంటున్నారు ఎవరిపై చేస్తారని ఆయన ప్రశ్నించడం ద్వారా… ఆయన తాను ఎలా వ్యవహరించబోతున్నానో పరోక్షంగా సంకేతం ఇచ్చారు. దాంతో ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గడమే బెటర్ అని అనుకున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. ఉద్యోగ సంఘ నేతల వల్లే. కేసీఆర్ హయాంలో ఏం జరిగినా.. బాకా ఊదారు. ఇప్పుడు మేము మంచిచేస్తూంటే రోడ్డెక్కుతారా అన్నది రేవంత్ పాయింట్. ఆయన కోణంలో ఉద్యోగులకు చాలా మంచి చేస్తున్నామని ఆయన ఉద్దేశం. ప్రభుత్వాధినేతలకు అలాగే ఉంటుంది. అయినా తమ డిమాండ్లను గట్టిగా చెప్పుకునే హక్కును ఉద్యోగ సంఘాల నేతల వల్లనే ఉద్యోగులు కోల్పోయారు. అదే బీఆర్ఎస్ హయాంలోనూ గట్టిగా నిలబడి ఉంటే.. ప్రభుత్వానికి లొంగిపోకపోయి ఉంటే ఇప్పుడు బలంగా నిలబడే అవకాశం ఉండేది.
ఏపీలో అయితే ఏ ఒక్క ఉద్యోగ సంఘం నేత కూడా నోరెత్తలేరు . అందరూ వైసీపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయారు. ఎంతగా ఉంటే టీడీపీ మీదనే రాజకీయ విమర్శలు చేసేవారు. స్థానిక ఎన్నికలు ఎస్ఈసీ పెడితే.. ఆయనపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెబితే అది చేశారు. ఉద్యమం ప్రారంభించి.. మధ్యలో అమ్మేసుకునేవారు. చివరికి సీపీఎస్ రద్దు చేయకపోయినా రద్దు అయిందని సంబరాలు చేశారు. వారి తీరుతో ఇప్పుడు ఉద్యోగ సంఘం నేతలు తమ హక్కుల గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం వద్దకు వెళ్లలేకపోతున్నారు. ఒక్క సూర్యనారాయణ అనే నేత మాత్రం మాట్లాడుతున్నారు. కానీ ఆయనకూ అంత స్కోప్ ఉండదు. ఎవరైనా టీడీపీ ప్రభుత్వం మాట్లాడాలనుకుంటే.. ప్రభుత్వ పెద్దలకు కోపం రాకుండా ఉంటుందా ? ఆ విషయం తెలుసు కాబట్టే సైలెంటుగా ఉంటున్నారు.
ఉద్యోగుకు పే రివిజన్ కమిషన్ వేయా ల్సిఉంది. కానీ ప్రభుత్వాలు లైట్ తీసుకుంటున్నాయి. వారిని ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు ప్రభుత్వాలకు తెలుసు. ఏమైనా అంటే అందర్నీ డిస్మిస్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటాయి. గతంలో చేసిన ఉద్యోగ సంఘాల నేతల నిర్వాకాల వల్ల వారి బలం అంతా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడల్లా వారు హక్కులపై పోరాడలేరు. ప్రజల మద్దతు కూడా రాదు.