తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. వెంటనే రేవంత్ రెడ్డి సర్కార్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగించేందుకు సిద్ధమవుతోంది. పట్టణ ప్రాంతాలపై పట్టు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. తెలంగాణలోని 140కి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కనీసం 95 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్, పట్టణ ఓటర్లను కూడా తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది.
జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు
పట్టణ ప్రాంతాల్లో తమకే పట్టు ఉందని నిరూపించేందుకు రేవంత్ పక్కా ప్లాన్లు అమలు చేస్తున్నారు. జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలు అప్పగించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. ఈ గెలుపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా అవతరించిందని నిరూపించాలనేది రేవంత్ రెడ్డి ప్రధాన ఉద్దేశం. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జనవరి 2026 నాటికి కొత్తగా ఓటు హక్కు పొందిన వారిని చేర్చడంతో పాటు, జాబితాలో ఉన్న లోపాలను సరిదిద్దాలని అధికారులను ఆదేశించింది.
పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు
వార్డుల వారీగా ఓటర్ల విభజన, రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు దాదాపు 90 శాతం పూర్తయింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన వార్డుల విభజనలో కొన్ని అక్రమాలు జరిగాయని భావిస్తున్న కాంగ్రెస్, ఈసారి శాస్త్రీయంగా మరియు తమకు అనుకూలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తారు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను ప్రధాన ఆయుధాలుగా వాడుకోనుంది. ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు పట్టణ మధ్యతరగతి ప్రజలపై సానుకూల ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ నమ్ముతోంది. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ మెట్రో విస్తరణ, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను హైలైట్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని రేవంత్ టీమ్ భావిస్తోంది.
విపక్షాల ఉక్కిరిబిక్కిరి.. వ్యూహాత్మక అడుగులు
ప్రతిపక్ష బీఆర్ఎస్ సమస్యల్లో అంతర్గత విభేదాల నుంచి కోలుకోకముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా వారిని ఆత్మరక్షణలో పడేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసినా, ఇప్పుడు సీన్ రివర్స్ చేయాలనే పట్టుదలతో రేవంత్ ఉన్నారు. అటు బీజేపీ కూడా పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉండటంతో, త్రిముఖ పోటీ జరిగినా ఓట్లు చీలకుండా ఉండేలా లోకల్ సెంటిమెంట్,అభివృద్ధి కార్డులను కాంగ్రెస్ బలంగా ప్రయోగించనుంది.
