హైదరాబాద్ నగరపాలనలో రాబోయే రోజుల్లో పెను మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఆచి తూచి అడుగులు వేస్తోంది. మూడు కార్పొరేషన్లుగా మార్చిన నగరం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. దానికి బదులుగా, ఒక్కో కార్పొరేషన్‌కు విడివిడిగా ఎన్నికలు జరిపే వ్యూహాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనివల్ల పాలనా యంత్రాంగంపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, రాజకీయంగా కూడా లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.
ఓ మున్సిపల్ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరించే చాన్స్
ఒక మున్సిపల్ కార్పొరేషన్‌ను పునర్వ్యవస్థీకరించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వంలో ఉన్నాయి. వార్డుల సంఖ్యను పెంచడం ద్వారా ఒక రాజకీయ పార్టీకి ఉన్న పట్టును బలహీనపరచాలని, తద్వారా రాజకీయ శక్తిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వార్డుల పునర్విభజన ప్రక్రియే రాబోయే రోజుల్లో మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకోవాలనే అంశాన్ని నిర్ణయించనుంది. ముఖ్యంగా మల్కాజ్గిరి వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో ఇంకా పట్టు చిక్కకపోవడం, అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉండటంతో ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.
సైబరాబాద్ కార్పొరేషన్ మరింత భిన్నం
సైబరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉన్నాయి. ఆంధ్ర మూలాలున్న ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో గెలుపు గుర్రం ఎక్కడం ఏ పార్టీకైనా సవాలే. ఈ కారణంగాముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనుల కోసం 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. జూన్ 2, 2026 నాటికి అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
శరవేగంగా అభివృద్ధి పనులు
ప్రజా సౌకర్యాల విషయంలో రాజీ పడకుండా ప్రతి కార్పొరేషన్‌కు సొంతంగా డంప్ యార్డ్, వీధి కుక్కల నియంత్రణ కోసం ఏబీసీ సెంటర్లు, బీటీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులన్నీ పూర్తయ్యాక భారీ ఎత్తున ప్రారంభోత్సవాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తద్వారా అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూనే, మరోవైపు రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను దెబ్బకొట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.


