అసెంబ్లీ సమావేశాల విషయంలో కేసీఆర్ పట్టుదలను, బీఆర్ఎస్ వ్యూహాలను పక్కాగా ఔపాసన పట్టిన రేవంత్ రెడ్డి కేసిఆర్ ను ప్రతి బాల్ కూ క్లీన్ బౌల్డ్ చేస్తున్నారు. బుధవారం ఆయన ప్రజాభవన్ లో పెట్టిన ప్రెస్మీట్లో కేసీఆర్ పై ఓ వైపు ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే మరో వైపు ఆయనపై చాలా గౌరవం చూపించారు. ఎంతగా అంటే.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన గౌరవమర్యాదలకు లోటు రాకుండా చూస్తామన్నారు. జరిగిన తప్పిదాలను దిద్దుకోవడానికి అవసరం అయిన సలహాలు,సూచనలు ఇవ్వాలని మాత్రమే కోరారు. రేవంత్ మాటలు విన్న ఎవరికైనా.. ఇంత మంచి వాడిని ద్వేషించి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదా అని అనుకుంటారు. అదే రేవంత్ ప్లాన్. బీఆర్ఎస్ కు అర్థమైనా కౌంటర్ ఎటాక్ చేయలేక సైలెంటుగా ఉండిపోతోంది.
కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రారు ?
కేసీఆర్ అసెంబ్లీకి రారని రేవంత్ రెడ్డి గట్టి నమ్మకం. అందుకే ఆయనను పదే పదే సవాల్ చేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధంగా లేరు. తొలి రోజు కేవలం ఆయన అటెండెన్స్ కోసమే వచ్చారు. ఆ సందర్భాన్ని రేవంత్ రెడ్డి పక్కాగా ఉపయోగించుకున్నారు. ప్రతిపక్ష నేతగా గౌరవం ఇవ్వడం ద్వారా రేవంత సభా సంప్రదాయాలను ఏ మాత్రం ఉల్లంఘించబోమని ఆయనకు గౌరవం ఉంటుందని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అయినా కేసీఆర్ ఉండలేదు. దాంతో ప్రెస్మిట్ లో కూడా అదే భరోసా ఇచ్చారు. ఇదంతా చూస్తున్న ప్రజలకు.. నిజమేగా..కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రారు అనుకుంటున్నారు. ఆయన గౌరవాన్ని పోగొట్టబోమని రేవంత్ హామీ ఇస్తున్నప్పుడు .. అసెంబ్లీకి వెళ్లి చర్చించడానికి కేసీఆర్కు ఏం నొప్పి అన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. అంటే.. అక్కడే కేసీఆర్ పై రేవంత్ గూగ్లీ వేశారన్నమాట.
మర్యాద రామన్న లా ఇమేజ్ !
గతంలో తెలంగాణ అసెంబ్లీ పదేళ్ల పాటు పెద్దగా జరిగిందేమీ లేదు. కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేసి ఏకపాత్రాభినయం చేసి వెళ్లిపోయేవాళ్లు.కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. కాంగ్రెస్ పాలనలోకి వచ్చాక అసెంబ్లిలో చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు గట్టిగానే తమ వాదనలు వినిపిస్తున్నారు. సమయం లభిస్తోంది. చెప్పాలనుకున్నది చెబుతున్నారు. ఎవరికీ అవమానాలు ఎదురు కావడం లేదు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ రాజకీయంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ..రేవంత్ ఆయనను అవమానిస్తారని అనుకుంటున్నారని అందుకే సభకు రావడం లేదని ఎక్కువ మంది అనుకుంటున్నారు. కానీ అలాంటివేమీ జరగబోవని.. గౌరవమర్యాదలు కాపాడతామని రేవంత్ భరోసా ఇస్తున్నారు. నిజానికి రేవంత్ ఇలా మాట్లాడటం..కేసీఆర్ అహాన్ని మరింత దెబ్బకొట్టినట్లే . ఎందుకంటే .. రేవంత్ కన్నా తాను ఎన్నో మెట్లు ఎత్తులో ఉంటానని కేసీఆర్ అనుకుంటారు. అలాంటి తన గౌరవం ఆయన కాపాడటమేమిటని ఆయన అనుకునే అవకాశం ఉంది. అలా అనుకుంటే అసలు అసెంబ్లీకి వచ్చే సాహసమే చేయరని అనుకోవచ్చు.
కేసీఆర్ అసెంబ్లీకి రావడమే బీఆర్ఎస్ పార్టీకి బెస్ట్ ఆప్షన్
రేవంత్ చేస్తున్న రాజకీయంతో బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు ఊపిరి సలపడం లేదు. రేవంత్ ఆవేశంతో ఏ పని చేయడం లేదు. అంతా పాజిటివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొడుతున్నారు. ఆ పార్టీ అగ్రనేతల ఈగో గురించి చాలా స్పష్టంగా లెక్కలేసుకుని ఆయన చేస్తున్న రాజకీయంతో మొత్తం మారిపోతోంది. ఇది బీఆర్ఎస్ నేతలకు అర్థమయిందో లేదో కానీ.. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకపోతే బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు వెళ్లడం వల్ల ఎక్కువ ప్లస్ ఉంటుంది. కానీ కేసీఆర్ ఇలాంటి రాజకీయలకు స్పందించడం అంటే ట్రాప్ లో పడటమే అనుకుని లైట్ తీసుకునే చాన్స్ ఉంది.
