అధికారులతో అడ్డగోలు పనులు చేయించి వాళ్లను తర్వాత జైలుకు పంపేలా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోవడం లేదు. ఎవరి పనులు వాళ్లు చేయాలని.. లీడర్లు చెప్పారని రూల్స్ కి వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం లేదని నేరుగానే చెబుతున్నారు. జలసౌధలో జరిగిన కొత్త ఉద్యోగులకు నియామక పత్రాలు అందించే కొలువుల పండుగ కార్యక్రమంలో రేవంత్ తన విధానాన్ని స్పష్టంగా చెప్పారు.
నాయకులు చెప్పారని రూల్స్ కు వ్యతిరేకంగా చేయవద్దు !
కాళేశ్వరం నిర్మాణం విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు వల్ల జరిగిన నష్టాన్ని స్పష్టం చేశారు. కనీసం సాయిల్ టెస్టులు కూడా చేయకుండా కేసీఆర్ చెప్పాడని సుందిళ్ల, మేడిగడ్డ లాంటి బ్యారేజీలు నిర్మించారు. కట్టిన మూడేళ్లకే కుంగిపోయాయి. ఇలా మూడేళ్లకే కుంగిపోయిన ప్రాజెక్టు కాళేశ్వరం తప్ప మరొకటి ఉండదని రేవంత్ చెప్పారు. నాయకులు చెప్పింది చేసి.. జైలుకు వెళ్లడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన నిజానికి అలా చెప్పకూడదు. తాము చెప్పింది చేయాలని .. ఎందుకు.. ఎమిటి.. ఎలా అని అడగకూడనది ఎక్కువ మంది అధికారంలో ఉన్న వారు కోరుకుంటారు.
ఒత్తిడి లేకుండా పని చేసుకునే అవకాశం ఇస్తున్న రేవంత్ ప్రభుత్వం
కానీ రేవంత్ అలా అనడంలేదు. నిబంధనల ప్రకారం.. పక్కాగా వ్యవహరించాలని అంటున్నారు. ఇది అధికారులకు కాస్త ధైర్యం ఇస్తోంది. పోలీసు అధికారుల్ని కూడా రేవంత్ ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారంగా వాడుకోవడం లేదు. ఏదైనా కేసులో ఆధారాలను బట్టే వెళ్లమని సలహా ఇస్తున్నారు. అందుకే ప్రతీకార అరెస్టులు జరగడం లేదని అనుకోవచ్చు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ. అయితే ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసే వారు కూడా ఉంటారు. అలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే సమస్యలు రాకుండా ఉండాయి. స్మితా సబర్వాల్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడానికి ఇదే కారణం అనుకోవచ్చు.
అధికారులను జైళ్లకు పంపే నేతలతో సమస్య !
అధికార వర్గాలకు అతి పెద్ద సమస్య రాజకీయమే. అధికారంలో ఉండేవారు అధికారుల్లో ఉండే కొన్ని రకాల బలహీనతల్ని అడ్డం పెట్టుకుని తమ పనులు పూర్తి చేయించేసుకుంటారు. తర్వాత వారు జైలు పాలవుతారు. జగన్ రెడ్డి ఎంత మందిని అలా జైలు పాలు చేస్తున్నాడో కళ్ల ముందే ఉంది. అలాగే కేసీఆర్ హయాంలో పని చేసిన అధికారులు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారంతా మనస్ఫూర్తిగా అలాంటి తప్పులు చేసి ఉండరు. అనేక ప్రలోభాలు..బెదిరింపుల కారణంగానే చేసి ఉంటారు. తెలంగాణ అధికారవర్గాలకు అలాంటి సమస్య రాకుండా చూస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ పాలసీ ఉద్యోగులు, అధికారులు తమ విధులు స్వేచ్చగా నిర్వహించేలా అవకాశం కల్పిస్తోంది.