ఏ పని సక్సెస్ కావాలన్నా ఓ ప్రణాళిక అవసరం. గాలి ఎటు వీస్తే అటు పోతే ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోరు. ఓ టార్గెట్ పెట్టుకుని దాన్ని సాధించాలంటే స్పష్టమైన విజన్ అవసరం. తెలంగాణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ విజన్ డాక్యుమెంట్ ను రెడీ చేసుకున్నారు. తెలంగాణ మొత్తం ఆర్థిక పరిస్థితి, వనరులు, బలాలు అన్నీ పక్కాగా విశ్లేషించుకుని ప్రణాళికలు వేసుకున్నారు. ఈ డాక్యుమెంట్ చూసిన వారెవరికీ అతిశయోక్తి అనిపించదు. సాధించగలిగేలానే ఉంటుంది. కానీ దానంతటకు అది అవుతుంది అని అనుకోలేరు. చాలా పెద్ద స్థాయిలో ఎఫర్ట్స్ పెడితేనే అమలు సాధ్యమవుతుంది.
ఆదర్శాలు, ఆశయాలు ఉన్నతం
ఆర్థిక వృద్ధి , సమ్మిళిత అభివృద్ధి , సుస్థిర అభివృద్ధి ని సాధించడానికి రేవంత్ మూడు దారులు రెడీ చేసుకున్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ .. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ప్రాంతం, పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ మధ్య ఉన్న జోన్, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) దాటి, రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతం. ఈ మూడు ప్రాంతాలను పది మార్గదర్శకాలను ఉపయోగించుకుని పరుగులు పెట్టించాలని అనుకుంటున్నారు. గేమ్-ఛేంజర్ ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టించడం, డిజిటల్ గవర్నమెంట్, T-ఫైబర్, SPEED వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం., ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం వంటి వాటితో విజన్ ఉన్నతంగా ఉంది.
రేవంత్ కలలకు ఇంధనం హైదరాబాద్
తెలంగాణను హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి చేయాలని రేవంత్ విజన్ డాక్యుమెంట్ లో పెట్టుకున్నారు. అందుకే టాప్ ప్రయారిటీ ఇచ్చారు. హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ నుంచి వచ్చే ఆదాయాన్ని, వనరుల్ని రాష్ట్రమంతటా విస్తరించి విభిన్నరంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించి.. 2047 నాటికి మూడు ట్రిలియన్ల ఎకానమీని టార్గెట్ చేశారు. ఇప్పటికి ఒక్క ట్రిలియన్ దగ్గరలో కూడా లేదు. కానీ అది అసాధ్యమేమీ కాదు. దానికి తగ్గట్లుగా పరిస్థితులు కలసి వస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద మెట్రో నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ .. రేవంత్ విజన్ డాక్యుమెంట్ ను ఆచరణలోకి తీసుకురావడానికి ఓ ఇంజన్ లా పని చేస్తుంది.
అమలులోనే సీఎం రేవంత్ సమర్థత, సిన్సియారిటీ !
విజన్ డాక్యుమెంట్.. రేవంత్ రెడ్డి తీసుకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకించాలని అనుకున్నవారికి నచ్చకపోవచ్చు. కానీ తెలంగాణ ప్రజల ఉన్నతిని కోరుకునేవారికి మాత్రం నచ్చుతుంది. అలాంటి ప్రణళికాలు వేసుకోవడంపై వారు ఆశ్చర్యపోరు. కానీ దాన్ని అమలులోకి తీసుకు వచ్చినప్పుడు మాత్రమే నమ్మకం పెంచుకుంటారు. ఎందుకంటే రాజకీయ నేతలు మాటలకే పరిమితం అవుతారు. ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే.. తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారు. అందుకే రేవంత్ రెడ్డి వచ్చే మూడు ఏళ్లలో తన బెస్ట్ పాలన చూపించి.. ఈ డాక్యుమెంట్ లో పేర్కొన్న వాటిలో పది శాతం అయినా అమలులోకి తీసుకురాగలిగితే చాలా వరకూ మార్పులు వస్తాయి. అదే ఆయనకు భవిష్యత్ రాజకీయాలకు భరోసా ఇస్తుంది. ప్రజల జీవితాలను మారుస్తుంది.
