తెలంగాణ అసెంబ్లీలో అందరూ ఎదురు చూసే రసవత్తర ఘట్టం ఆవిష్కృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభానాయకుడు అయిన రేవంత్ రెడ్డితో ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ ఎప్పుడూ అసెంబ్లీ సాక్షిగా ముఖాముఖి తలపడలేదు. అసలు అసెంబ్లీకే రాలేదు. ఇంకా చెప్పాలంటే అసలు రాజకీయంగానూ యాక్టివ్ గా లేరు. రెండేళ్ల తర్వాత ఆయన తెరపైకి వస్తున్నారు. బహిరంగసభలు పెట్టడంతో పాటు అసెంబ్లీకి హాజరు కావాలని అనుకుంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని హరీష్ రావు ప్రకటించారు. అయితే ఆయన సోమవారం అసెంబ్లీకి వస్తున్నారని చెప్పారు. వచ్చి చర్చల్లో పాల్గొంటారా లేకపోతే వెంటనే వెళ్లిపోతారా అన్నదానిపై స్పష్టత ఇవ్వడం లేదు.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ వ్యూహం భిన్నం
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి అసెంబ్లీ శీతాకాల సమావేశాల పైనే ఉంది. ముఖ్యంగా కేసీఆర్ రెండేళ్లుగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కాకపోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి నీటి ప్రాజెక్టులపై చర్చించాలి అని రేవంత్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ కేసీఆర్ సభకు రావాలని నిర్ణయించుకోవడం ఒక కీలక పరిణామం. ఇది కేవలం హాజరు మాత్రమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి సిద్ధమయ్యారనే సంకేతాన్ని ఇస్తోంది. కృష్ణా జలాల్లో వాటా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ కమిషన్ నివేదిక వంటి అంశాలపై పెద్ద ఎత్తున వాదనలు జరిగే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ సభలో ఉంటేనే ఆ వాదనలకు పూర్తి స్థాయి టెంపో వస్తుంది.
రేవంత్ ను ఢీకొట్టాల్సిందేనని కేసీఆర్ డిసైడ్ అయ్యారా?
కేసీఆర్ రాజకీయంగా ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోగలరు. కానీ ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పటి వరకూ పూర్తి స్థాయి రాజకీయం చేయలేదు. రేవంత్ రెడ్డితో పోటీ పడటం నామోషీగా ఆయన భావిస్తారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రజాస్వామ్యంలో హోదాలు ప్రజలు ఇచ్చేవే. సీఎం గా రేవంత్ పదవి ప్రజలు ఇచ్చారు.కేసీఆర్ ఔనన్నా..కాదన్నా రేవంత్ సీఎం. రేపు ప్రజల వద్దకు ఆయన పనితీరును చూపించి.. ఆయనపై తాను పోరాడానని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాల్సి ఉంటుంది. కష్టపడకపోతే ప్రజలు కూడా పట్టించుకోరు. అందుకే కేసీఆర్ పోరాటానికి ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
సమగ్రమైన చర్చలు జరిగితే ప్రజలే తేల్చుకుంటారు !
పథకాలు అయినా నీళ్లు అయినా సమగ్రమైన చర్చ జరిగితేనే తప్పు ఎవరిదో.. మంచి ఎవరు చేశారో ప్రజలకు క్లారిటీ వస్తోంది. నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తుండగా, తమకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ సభలో ఉన్నప్పుడే గత పదేళ్ల పాలనలోని వైఫల్యాలను, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను ఎత్తిచూపి ఆయన్ని ఇరకాటంలో పెట్టాలని రేవంత్ రెడ్డి అనుకోవడం సహజమే. అదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ప్రజల్లోకి తీసుకెళ్లడం కేసీఆర్ లక్ష్యమని చెప్పాల్సిన పని ఉండదు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య ఉన్న రాజకీయ వైరం సభలో మాటల యుద్ధానికి దారితీస్తుంది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల కారణంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కేసీఆర్ అసెంబ్లీని ఒక వేదికగా వాడుకునే అవకాశం ఉంది.
కేసీఆర్ రాకతో అసెంబ్లీలో కేవలం చర్చలు మాత్రమే కాదు..రాజకీయం జరిగే అవకాశం ఉంది. ఇద్దరూ అసెంబ్లీ యుద్ధంలో ఉండి పోరాడితే ప్రజలకు ఎవరు కరెక్టో తేల్చుకునేందుకు ఆవకాశం లభిస్తుంది. కేసీఆర్ ను సస్పెండ్ చేయడమో..లేకపోతే వారే బహిష్కరించడమో వంటి రాజకీయాలు చేస్తే.. పారిపోయారని ప్రజలు అనుకుంటారు.
