తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కృష్ణా జలాల విషయంలో చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి చాలా వేగంగా స్పందించారు. జనవరి రెండో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం.. మొత్తం చర్చించేందుకు రావాలని సవాల్ చేశారు. సాధారణంగా అయితే ఇలాంటి అంశాలపై ఆరోపణలు చేసినప్పుడు అసెంబ్లీని ఏర్పాటు చేసి సమగ్రంగా చర్చించాలని ప్రజల ముందు నిజాలు పెట్టాలని విపక్షనేతలు డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ కేసీఆర్ అసెంబ్లీ మాట ఎత్తలేదు. బహిరంగ సభలు పెడతామని మాత్రం ప్రకటించారు. కానీ రేవంత్ ముఖాముఖి తేల్చుకుందాం రమ్మని సవాల్ చేస్తున్నారు. కేసీఆర్ ఆరోపణల్లో నిజం ఉంటే.. రేవంత్ సవాల్ కంటే… మంచి అవకాశం దొరకదు. కానీ ఉపయోగించుకుంటారా.. పారిపోతారా అన్నది మాత్రం సస్పెన్స్ గా నే ఉంది.
కృష్ణా జలాల అంశంపై తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలి !
కృష్ణాజలాలతో రాజకీయాలు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారు. రాజకీయం అంటే తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా దక్కకపోతే ఆ అంశంపై తప్పనిసరిగా చర్చ జరగాల్సిందే. ఆ అన్యాయం ఎవరి వల్ల జరిగిందో కూడా బయటకు రావాల్సిందే. రాజకీయ నేతలు తప్పిదాలు చేస్తే దానికి తెలంగాణ మూల్యం చెల్లించకూడదు. తెలంగాణ పేరుతో సెంటిమెంట్ రాజకీయాలు చేసి..తెలంగాణకు అన్యాయం చేశాడని.. అసలు తెలంగాణకు నీటి వివాదాలు రావడానికే కేసీఆర్ కారణం అని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఎవరి ఆరోపణల్లో నిజం ఉందో ఎవరికి వారు ప్రెస్మీట్లు పెట్టి చెప్పుకుంటే ఎవరి వాదనవారు చెప్పుకుంటారు. కానీ అసెంబ్లీలో అయితే ముఖాముఖిగా ఆధారాలతో సహా చర్చించడానికి అవకాశం ఉంటుంది.
గుడ్డ కాల్చి రేవంత్ ముఖం మీద వేసి పారిపోతారా?
తెలంగాణకు అన్యాయం జరిగిపోయిందని తాము ఇక ఊరుకోలేమని కేసీఆర్ అంటున్నారు. ఆ అన్యాయం ఏమిటో.. అది ఇప్పుడే జరుగుతోందా.. ఎప్పటి నుంచో జరుగుతోందా అన్నది మాత్రం చెప్పడంలేదు. కానీ రేవంత్ ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తోందన్న అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నించారు. అంటే .. గుడ్డ కాల్చి ముఖం మీద వేశారు. ఇపుడు తుడుచుకోండి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ రేవంత్.. ఇలా తన ముఖంపై గుడ్డ కాల్చి వేస్తే తుడుచుకునేందుకు ఆసక్తి చూపరు. అది తీసి వేసిన వాళ్ల ముఖం మీదనే వేసేందుకు ప్రయత్నిస్తారు. అది కూడా తప్పించుకోలేని విధంగా. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన తప్పని సరి పరిస్థితి ఏర్పడుతోంది.
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఇబ్బందికరమే !
రేవంత్ రెడ్డి ఓ చెరువు గట్టు మీదకో… రచ్చబండ దగ్గరకో చర్చకు రమ్మని సవాల్ చేయలేదు. అసెంబ్లీకే రమ్మన్నారు. అసెంబ్లీకి రావడం అనేది ప్రతిపక్ష నేత విధి. ఆయన రావడం లేదు. ఆయన రావాలని కేసీఆర్ కోరుతున్నారు. బీఆర్ఎస్ కు కావాల్సినంత బలం ఉంది. ఒక వేళ అసెంబ్లీలో కేసీఆర్ తన వాదనను వినిపించుకోవడానికి కాంగ్రెస్ నేతలు అవకాశం ఇవ్వకపోతే.. ఆ విషయాన్నీ ప్రజలు తమ నోటీస్ లో ఉంచుకుంటారు. అసలు ఇన్ని ఆరోపణలు చేసిన కేసీఆర్.. అసెంబ్లీకే రాకపోతే ఆయన మాటలకు అసలు విలువ లేకుండా పోతుంది. ఈ విషయం ఆలోచించాల్సింది..కేసీఆర్.. కేటీఆరే !.కేసీఆర్ వచ్చినా రాకపోయినా.. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చేసిన తప్పుల్ని అసెంబ్లీలో బయటపెట్టడం ఖాయం. డిఫెండ్ చేసుకోవడానికైనా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
