2023, డిసెంబర్ 3. అప్పటికి రేవంత్ రెడ్డి విజేత కాదు. పోరాటయోధుడే. కానీ ఆ రోజున విజేతగా నిలిచారు. ఆయన జీవితంలో అనుకున్న విజయం సాధించిన రోజు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని అనుకున్న సమయంలో పగ్గాలు చేపట్టి ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా.. ఎన్నికలకు ముందు ఆరు నెలల్లో జరిగిన పరిణామాలను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన రోజు డిసెంబర్ 3, ఈ రోజున వచ్చిన ఫలితాలకు రెండేళ్లు అయింది. ఈ రెండేళ్లలో సీఎంగా రేవంత్ రెడ్డి మరింత బలపడ్డారు. ముందు ముందు ఎన్ని విజయాలు సాధించినా.. రెండేళ్ల కిందట ఇదే రోజున సాధించిన విజయం మాత్రం ప్రత్యేకమే.
2023, డిసెంబర్ 3 తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన రోజు
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీని కాంగ్రెస్ పార్టీ విభజించింది. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ లబ్ది కోసమో.. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను గుర్తించిందో కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ దెబ్బతిన్నది. ఏపీలో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టుకోవడం.. రాష్ట్ర విభజనతో క్యాడర్ మొత్తం ఆ పార్టీకి వెళ్లిపోయింది. జీరో అయిపోయిది. పోనీ తెలంగాణలో అయినా ప్రజలు ఆదరిస్తారనుకుంటే పదేళ్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. మూడో సారి అతి కష్టం మీద కాంగ్రెస్ కు ఓటేశారు. రెండు సార్లు కాంగ్రెస్ ను పట్టించుకోకపోవడానికి.. గత ఎన్నికల్లో ఓట్లేయడానికి కారణం.. రేవంత్ రెడ్డి నాయకత్వం.
బీఆర్ఎస్ను ఓడించడానికే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ రాజకీయ నేతల్లో రేవంత్ రెడ్డి పడినన్ని అవమానాలు, కష్టాలు మరో నేత పడి ఉండరు. తొందరపాటుతో బీఆర్ఎస్ వేసిన ట్రాప్ లో పడటం అంతిమంగా ప్లస్ అయింది. చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఓ మాట చెబుతూ ఉంటారు.. తాను కేసీఆర్ ను ప్రత్యర్థిగా ఎంచుకోలేదని.. ఆయనే తనను ప్రత్యర్థిగా ఎంచుకున్నారని చెబుతారు. ఆ కారణంగానే రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదురు తిరిగి నిలబడటం ద్వారా రేవంత్ ప్రజల్లో మంచి ఆదరణ తెచ్చుకున్నారు. కేసీఆర్ కు తిరుగులేదని.. ఆయన స్థాయి నేత లేదనుకున్న వారికి చాలా వేగంగానే రేవంత్ రెడ్డిలో నాయకుడు కనిపించారు. ఫలితమే.. కాంగ్రెస్ పార్టీకి విజయం. రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగితేనే. . బీఆర్ఎస్ ను ఓడించగలమని చెప్పి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అంతిమంగా తాను అనుకున్నది సాధించారు.
రేవంత్ లేని విజయాన్ని ఊహించలేరు..!
2023 డిసెంబర్ లో ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు జూన్ వరకూ కాంగ్రెస్ పార్టీ అసలు రేసులో లేదు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రధానంగా పోటీ పడితే కాంగ్రెస్ ఓట్లు చీలుస్తుందని అంతిమంగా బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకున్నారు. బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూకుడుగా ఉంది. మరోసారి బీఆర్ఎస్ గెలవడం ఇష్టం లేకనో ఏమో కానీ బీజేపీ బండి సంజయ్‌ను తప్పించింది. కిషన్ రెడ్డిని నియమించింది. అంతే రేవంత్.. తన రాజకీయం తాను చేశారు. ఆరు నెలల్లో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ గెలిచింది. గెలిచేపార్టీ అన్న భావనను రెండు నెలల ముందుగానే తెచ్చుకున్నారు. చివరికిఫలితాల్లో అది ప్రతిఫలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కూడా తెలంగాణ ప్రాంతంలో సాధించలేనన్ని సీట్లను కాంగ్రెస్‌కు సాధించి పెట్టారు. ఇప్పుడు విజయపరంపర సాగించేందుకు అహరహం శ్రమిస్తున్నారు.