తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. పాలనలో వేగం పెంచేందుకు ఇటీవల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల భారీ యాక్షన్ ప్లాన్ను ప్రకటించారు. మార్చి 6న ప్రారంభమై జూన్ 12 వరకు సాగే ఈ కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో పాలనను పరుగులు పెట్టిస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది. ప్రజా ప్రతినిధులంతా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలని, పారిశుధ్యం నుండి ఫైళ్ల క్లియరెన్స్ వరకు అన్నీ యుద్ధప్రాతిపదికన జరగాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అయితే ఇప్పుడు అసలు అలాంటి ప్రోగ్రాం జరుగుతోందని కూడా ఎవరికీ తెలియడంలేదు.
ప్లాన్ గొప్ప – అమలు దిబ్బ
ప్రభుత్వం ఈ 99 రోజుల ప్రణాళికను ఐదు దశలుగా విభజించి, ప్రతి వారానికి ఒక నిర్దిష్ట రంగాన్ని కేటాయించింది. మార్చి నెలలో పది రోజుల పాటు సాగిన స్పెషల్ డ్రైవ్లో సుమారు లక్షకు పైగా పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేశామని, వందల టన్నుల చెత్తను తొలగించామని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. అనేక గ్రామాల్లో గ్రామసభలు కేవలం మొక్కుబడి వ్యవహారంగా సాగుతున్నాయని, గతంలో ప్రజాపాలనలో ఇచ్చిన లక్షలాది దరఖాస్తులు ఇంకా బుట్టదాఖలే అయ్యాయని ప్రజలు వాపోతున్నారు. ఆర్భాటంగా లోగోలు ఆవిష్కరించడం, డాష్ బోర్డులు ఏర్పాటు చేయడంపై ఉన్న శ్రద్ధ, క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేయడంపై లేదన్న పెదవి విరుపు కనిపిస్తోంది.
నిధులు లేవని లైట్ తీసుకుంటున్న ఎమ్మెల్యేలు
ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షించాలన్న ఆదేశాలు కాగితాలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. వేసవి తీవ్రత, సాగునీటి ఎద్దడి, ధాన్యం కొనుగోలు వంటి కీలక సమస్యలు రైతులను వేధిస్తున్నా, యాక్షన్ ప్లాన్ పేరుతో కేవలం ఫోటో షూట్లు, రివ్యూ మీటింగ్లకే పరిమితమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రైతు భరోసా నిధుల విడుదల వంటి అంశాల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల వంటి ప్రధాన హామీల అమలులో స్పష్టత కరువైంది. 99 రోజుల ప్రణాళికలో భాగంగా కేటాయించిన పనులు నిధుల కొరత కారణంగా అనేక చోట్ల నత్తనడకన సాగుతున్నాయి.
ప్రజలకు కనిపించని ప్రగతితో ప్రయోజనం ఏమిటి?
ఏదైనా పని తీరు ప్రజలకు కనిపించేలా చేయగలగాలి. కానీ పత్రికా ప్రకటనల్లో కనిపిస్తున్న వేగం పనుల్లో కనిపించడం లేదు. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి గొప్పగా ఈ కార్యక్రమం పూర్తి చేసి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లారని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటోంది. కానీ ఇప్పుడు ఆ 99 రోజుల ప్రణాళిక అసలే అంంతమాత్రంగా ఉంది. ఇక ఎన్నికలకు ఏం వెళ్తారన్నట్లుగా పరిస్థితి మారింది.
