వైసీపీ ఆస్థాన వ్యూహకర్త, సలహాదారులకే సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ మైక్ పట్టుకుని కీచుగొంతుతో సింక్ కాని డైలాగులు చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌లను రాజకీయంగా సమాధి చేస్తా అంటూ ఆయన ఇచ్చిన వార్నింగ్ చూసి జనం నవ్వుకోవాలో, జాలిపడాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. నిజానికి సజ్జల టాలెంట్ అందరూ చూస్తున్నారు. తన తుప్పుపట్టిన సలహాలతో, విషపూరితమైన స్క్రిప్టులతో ఇప్పటికే జగన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును ఐదు అడుగుల లోతున పాతిపెట్టేశారు. సమాధి చేసేశారు.
వైసీపీ పొలిటికల్ ఫినిషర్ సజ్జల
సజ్జల రాజకీయం ఎలా ఉంటుందంటే.. రోగం ఒక చోట ఉంటే మందు ఇంకో చోట వేసినట్లు ఉంటుంది. గత ఐదేళ్లలో ఆయన రాసిచ్చిన స్క్రిప్టులు చదివి జగన్ రెడ్డి జనాలకు ఎంతలా దూరమయ్యారో 2024 ఎన్నికల ఫలితాలే సాక్ష్యం. వివేకా హత్య కేసు నుంచి తల్లి, చెల్లిని దూరం చేసుకునే వరకు.. వెనుక ఉండి నడిపించిన పెద్దల సలహాల ప్రభావం ఎంత ఉందో అందరికీ తెలిసిందే. తన చుట్టూ ఉన్న సొంత రక్తాన్ని దూరం చేసి, జగన్‌ను ఒక గదికే పరిమితం చేసిన సజ్జల గారి వ్యూహ చతురతకు మెచ్చి నెటిజన్లు ఆయన్ని వైసీపీ పొలిటికల్ ఫినిషర్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.
లోకేష్ గెలుపుపై ఈర్ష్యే
2019లో లోకేష్‌ను గెలవలేదని విమర్శించే సజ్జల ఇప్పుడు నేరుగా ప్రజల ద్వారా భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో కూర్చుంటే, సజ్జల మాత్రం ఇంకా ప్రెస్ మీట్ గదిలో కూర్చుని పాత రికార్డునే ప్లే చేస్తున్నారు. నిజానికి జగన్ రెడ్డిని ఒక సీరియస్ లీడర్ నుంచి సోషల్ మీడియాలో కమెడియన్ గా మార్చిన క్రెడిట్ కూడా సజ్జల కే దక్కుతుంది. సిద్ధం.. సిద్ధం అంటూ జగన్‌తో ఊగిపోయేలా చేసి, చివరికి ప్రజల ముందు ఆయన్ని నవ్వులపాలు చేశారని సొంత పార్టీ నేతలే ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు.
వైసీపీని తుడిచి పెట్టే వరకూ సజ్జల వదిలేలా లేరు!
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత శక్తివంతుడిగా చలామణి అయిన సజ్జల, ఇప్పుడు తన ఉనికి కోసం తాపత్రయపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌లను సమాధి చేస్తామని ఆయన చెబుతుంటే.. సారూ! మీరు గైడ్ చేసిన పుణ్యమా అని ఇప్పటికే పార్టీ 11 సీట్లకు పరిమితమైంది.. ఇంకా ఏం మిగిలిందని సమాధి చేయడానికి? అంటూ సొంత పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. బహుశా వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఆయన విశ్రమించేలా లేరు. అందుకే ఆయన ఇచ్చే ప్రతి ప్రెస్ మీట్.. టీడీపీ శ్రేణులకు ఒక పండగలా, వైసీపీ శ్రేణులకు ఒక దండగలా మారుతోంది.
సజ్జల సలహాల పుణ్యమా అని జగన్ రెడ్డి ప్యాలెస్ కే పరిమితమైతే, సజ్జల గారు మాత్రం ఇంకా గాల్లో మేడలు కడుతున్నారు. శత్రువుల అవసరం లేకుండానే సొంత పార్టీని ఎలా ఖతం చేయాలో సజ్జల గారిని చూసి నేర్చుకోవచ్చు.
