కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పడం ఆయన చేసే డైరక్ట్ రాజకీయాలకు సరిపడేలా కనిపించడం లేదు. వారు పార్టీలో చేరింది అందరూ చూశారు. ప్రజలకు తెలుసు. వారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లానే చెలామణి అవుతున్నారు. ఇలాంటి సమయంలో వారిని అనర్హతా వేటు నుంచి తప్పించడానికి.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించకుండా ఉండటానికి మధ్యేమార్గంగా వారు సాంకేతికంగా పార్టీ మారలేదు అని నమ్మించాలని డిసైడయ్యారు. కానీ ఇది రేవంత్ మార్క్ పాలిటిక్స్ ప్రమాణాలకు చాలా దూరంగా కనిపిస్తోంది.
విలీనం చేసుకోలేకపోవడం మొదటి వైఫల్యం
అతి స్వల్ప మెజార్టీ వచ్చినప్పుడు… తన ప్రభుత్వంపై ఖచ్చితంగా ఇతర పార్టీలు కుట్రలు చేస్తాయని అనుకున్నప్పుడు రేవంత్ చేయాల్సిన రాజకీయం చేయలేకపోయారు. మొదట్లో ఫిరాయింపులు వద్దనుకున్నారు. రెండు సార్లు కాంగ్రెస్ ఎల్పీల్ని కేసీఆర్ విలీనం చేసుకున్నా .. తమకు ఏమీ నష్టం జరగలేదని మళ్లీ గెలిచామని అందుకే ఫిరాయింపుల్ని తాను నమ్మబోనన్నారు. కానీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని తెలిసిన తర్వాత మనసు మార్చుకున్నారు. అప్పుడు అయినా కేసీఆర్ స్టైల్లో విలీనం చేసుకునేంత భారీగా ఆకర్ష్ చేపట్టి ఉంటే.. టిట్ ఫర్ టాట్ అయ్యేది. కానీ పది మందితోనే ఆపేశారు. అక్కడే అసలు సమస్య వచ్చింది.
సుప్రీంకోర్టు గడువు మరో పెద్ద సమస్య
అనర్హత విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు పాటించాల్సిన అవసరం స్పీకర్ కు లేదని ఎక్కువ మంది అభిప్రాయం. ఆ విషయం చట్టంలో కూడా లేదని స్వయంగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అనర్హతా పిటిషన్లు, రాజీనామాల విషయంలో స్పీకర్ గడువు ఉండేలా చట్టంలో మార్పులు చేయాలని సుప్రీంకోర్టు.. పార్లమెంట్‌కు కూడా సూచించింది. అయినా కొన్ని అంశాల ఆధారంగా సుప్రీంకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా ధిక్కరిస్తే వ్యవస్థల్ని ఎదిరించినట్లు అవుతుంది. ఆ ఇమేజ్ రేవంత్ కోరుకోరు. అదే సమయంలో అమలు చేస్తే.. ఇక అన్ని రాష్ట్రాల్లోనూ తప్పనిసరిగా అమలు చేయాల్సిన బెంచ్ మార్క్ లా మారుతుంది. ఇది ఓ రకంగా ప్రజాస్వామ్యానికి మంచిదే. కానీ ఈ తీర్పు అమలు చేయడానికి రేవంతే సమస్యలు ఎదుర్కోవాల్సిన ఉంటుంది.
ఉపఎన్నికలకు సిద్ధంగా లేని ఎమ్మెల్యేలు
సాంకేతికంగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పడం వల్ల తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెక్కవచ్చు. కానీ ఇది ప్రజల్లో రకరకాల చర్చలకు కారణం అవుతుంది. తమ పార్టీలో చేరిన వారిని కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు కాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి ఆ ఎమ్మెల్యేలు ఉపఎన్నికలకు సిద్ధంగా లేరు. రేవంత్ కూడా అదో రిస్క్ వ్యవహారం అనుకుంటున్నారు. ఉపఎన్నికలు రావు అంటున్నారు. సరైన కారణం లేకుండా రాజీనామా చేయడం ఖచ్చితంగా సమస్యలు తెచ్చి పెడుతోంది. అందుకే ఉపఎన్నికల కన్నా వారు అసలు పార్టీలో చేరలేదని చెప్పడమే బెటరనుకుంటున్నారు. కానీ అది రేవంత్ మార్క్ రాజకీయం కాదు.