ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య గ్యాప్ తగ్గించడానికి బీఆర్ఎస్ హైకమాండ్… ఆత్మీయ సమావేశాలను ప్లాన్ చేసింది. ఎలా సమావేశాలు నిర్వహించాలో దిశానిర్దేశం చేసింది. ఈ సమావేశాలతో అందరూ కలిసిపోతారని బీఆర్ఎస్ హైకమాండ్ భావించింది. కానీ జరుగుతోంది మాత్రం వేరు. ఈ సమావేశాలు వారి మధ్య విబేధాలను మరింత పెంచుతున్నాయి. పార్టీ క్యాడర్ సైతం నేతల తీరును సమ్మేళనాల సమావేశంలోనే నిలదీస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్నప్పటికీ తమకు గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను ఏప్రిల్ 25వ తేదీ లోపు పూర్తిచేయాలని పార్టీ అధిష్టానం శ్రేణులను ఆదేశించింది. అందుకోసం జిల్లాలకు సమన్వయకర్తలుగా జిల్లా ఇన్చార్జిలను నియమించింది. జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు విజయవంతం చేసేందుకు సమన్వయకర్తలను నియమించినప్పటికీ వారి ముందే అసంతృప్తి బయటపడుతుంది. తమ సమస్యను విన్నవించుకుందామనుకున్న నేతలు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. అలాంటప్పుడు పార్టీలో ఉండి లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజల వద్దకు ఎన్నికల సమయంలో ఎలా పోవాలని మీరే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కీలక నేతలు ఈ సమావేశాల్ని హైజాక్ చేస్తూండటంతో చాలా మంది హాజరు కావడం లేదు. సెంబ్లీ ఎన్నికలకు పార్టీ నేతలకు కేడర్ మధ్య ఉన్న గ్యాప్ గెలుపు పై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన కనిపిస్తోంది. సమావేశాలకు కొంతమంది నేతలకు ఆహ్వానం ఉండకపోవడం.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి వారుగా వారి అనుచరులకు మాత్రమే ఆహ్వానిస్తుండడంతో ఉద్యమకారులు పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఈ ఆత్మీయ సమావేశాలు కొత్త సమస్యలకు కారణం అవుతున్నాయని క్యాడర్ ఆందోళన చెందుతోంది.