ఎడిటర్స్ కామెంట్ : ఉరుకులాట – ఉత్తశాట..!

“గురుకుల పాఠశాలల్లో పిల్లలకు భోజనం పెట్టడానికి డబ్బుల్లేవు కానీ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచకుండా చేయడానికి లక్షలు ఖర్చు పెట్టి లాయర్లతో వాదనలు చేయిస్తూ ఉంటారు..!” .. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో నేడు కనిపిస్తున్న దృశ్యం. ఓ వైపు ముఖ్యమంత్రి.. వందలు, వేల కోట్ల రూపాయలతో పథకాలు.. పనుల ప్రకటనలు చేస్తూంటారు. మరో వైపు ఏ మాత్రం తగ్గకుండా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూంటారు. కానీ ఒక్కటంటే ఒక్క పని కాదు. చివరికి పిల్లలకు పెట్టే భోజనానికి కూడా బిల్లులు మంజూరు చేయలేనంత దీన స్థితి.

హాస్టల్స్‌లో పిల్లలకు అన్నం పెట్టలేనంత దీన స్థితా…!?

గురుకుల పాఠశాలల్లో పిల్లలకు ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ. 27 కోట్లు బాకీ పడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అదేదో తన సొమ్ముతో పెడుతున్నట్లుగా జగనన్న గోరు ముద్ద అని పేరు పెట్టారు. కాంట్రాక్టర్లను రివర్స్ టెండరింగ్ చేశారు. కానీ..బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. ఆ కాంట్రాక్టర్లు ఆశతో చూసి.. చూసి నిరాశకుగురయ్యారు. ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పుడు అయినా ఇస్తారేమోఅనుకున్నారు. అదీ లేదు. కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ బడ్జెట్ పెట్టలేదు. దీంతో తమకు బిల్లులు వస్తాయన్న నమ్మకం కలగలేదు. అందుకే ఆస్తులన్నీ అమ్మి సరుకు సరఫరా చేసినా డబ్బులు వచ్చేలా లేవని.. వారు ఆపేశారు. ఫలితంగా గురుకుల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. వారి ఆకలిని చూడలేక … ఉపాధ్యాయులే కొన్ని చోట్ల తెచ్చి పెడతున్నారు. కొన్ని చోట్ల సెలవులు ఇచ్చి పంపేస్తున్నారు. ఓ ప్రభుత్వ పనితీరుకు… ఈ చిన్న పిల్లల ఆకలే నిలువెత్తు సాక్ష్యం. ఆర్థిక సంవత్సరం చివర్లో… రూ. 2800 కోట్లను… ఖజానాలో డబ్బుల్లేకపోయినా వేస్ అండ్ మీన్స్ పద్దు కింద అప్పు తెచ్చి మరీ.. గడువు ముగిసిపోయినా… సస్పెన్స్ ఖాతాలో వేసి మరీ చెల్లింపులు చేశారు. అంత అర్జెంట్ ఏ కంపెనీ బిల్లలకు వచ్చిందో కానీ.. చిన్న పిల్లల ఆకలి తీర్చడానికి మాత్రం కాదని తేలిపోయింది. ప్రభుత్వ ప్రయారిటీ ఏమిటో కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆదాయమంతా ఎటు పోతోంది..? అప్పులన్నీ ఏమవుతున్నాయి..?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై ఇప్పటికి పూర్తి వివరాలు బయటకు తెలియడం లేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదైనా రాజ్యాంగబద్ధ పాలన చేయాలనుకుంటే ముందుగా బడ్జెట్‌ను ఆమోదింప చేసుకుంటారు. అన్ని వివరాలను ప్రజల ముందు… పెట్టి… తాము ఎలా ఖర్చు పెడతామో.. ఎలా ఆదాయం సంపాదిస్తామో చెబుతారు. కానీ ఘనత వహించిన ఏపీసర్కార్ మాత్రం అత్యంత రహస్యంగా ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ తాత్కాలికంగా వాడుకుంటోంది. ఫలితంగా అసలు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియడం లేదు. ఉద్యోగులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో జీతాలివ్వలేదని… ఇంకా కొంత మంది మిగిలిపోయారని.. ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ పీఎఫ్. జీపీఎఫ్ సొమ్ములను వాడుకున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు. ఓ వైపు చెల్లించాల్సిన బిల్లులు రూ. డెభ్బై వేల కోట్ల మేర పేరుకుపోయాయన్న ప్రచారం జరుగుతోంది. రోడ్డు మరమ్మత్తులు చేయాలని టెండర్లు పిలిస్తే… డబ్బులు ఇవ్వరన్న ఉద్దేశంతో ఒక్క కాంట్రాక్టరూ ముందుకు రాలేదంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై అన్ని వర్గాల్లోనూ నెలకొన్న అనుమానాలకు ఇంత కంటే ప్రత్యేకమైన తార్కాణం ఏమీ అక్కరలేదు. అటు సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టిన బిల్లులు చెల్లించడం లేదు.., ఇటు అభివృద్ధి పనుల బిల్లులూ ఆగిపోయాయి. మరి అప్పులు తెచ్చిన రూ. వేల కోట్లు ఏమైపోయాయన్నది ఇప్పుడు చాలా మందికి తెలియని ప్రశ్న. గడిచిన ఆర్థిక సంవత్సరంలో… ప్రభుత్వం నేరుగా కానీ.. గ్యారంటీల ద్వారా కనీసం రూ. లక్ష్ల కోట్లకుపైగానే అప్పు చేసింది. అది ఇంకా ఎక్కువ మొత్తమే ఉండొచ్చు. నిజానికి అప్పులు తెచ్చే మొత్తంలో ఎక్కువగా పెట్టుబడి వ్యయం చేయాలి. అంటే… పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టాలి. అలా కట్టడం వల్ల .. ప్రజల ఆదాయం పెరుగుతుంది. అంటే రాష్ట్ర సంపద పెరుగుతుంది. కానీ పోలవరంలో రెండేళ్లలో రెండు, మూడు శాతం పనులు కూడా చేయలేదని పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సమర్పించే నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఏ అభివృద్ది పని కూడా జరగడం లేదు. మరి అప్పులు చేసిన డబ్బులన్నీ ఎటు పోయాయి…?

ఓ వైపు పిల్లల ఆకలి కేకలు..మరో వైపు వాలంటీర్లకు సన్మానాలు..!

పసి పిల్లలలకు అన్నం పెట్టలేనంత దీనస్థితికి ప్రభుత్వం వెళ్లినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నా… ఎక్కడా హడావుడి మాత్రం తగ్గడం లేదు. వందల కోట్లు వెచ్చించి పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నారు. వాలంటీర్లకు సన్మానాలు చేస్తున్నారు. ఉగాది రోజున వాలంటీర్లకు సన్మానం పేరుతో వారికి ఇచ్చే నగదు బహుమతి కానీ… పత్రికా ప్రకటనలకు కానీ రూ. మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. ఇక… అభివృద్ధి పనులకు నిధులకు పరిపాలనా అనుమతుల పేరుతో వందలు, వేల కోట్ల జీవోలు విడుదల చేస్తూ ఉంటారు. కానీ తర్వాత వాటిని పట్టించుకోరు. చివరికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు .. రెండేళ్లలో.. కొన్ని వందల కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ నిధుల విడుదల మాత్రం ఆ స్థాయిలో లేదు. అక్కడ పనులేమీ పెద్దగా జరగడం లేదు. నిజానికి ఏపీ సర్కార్ అప్పులు మాత్రమే కాదు.. ప్రజల్ని కూడా పెద్ద ఎత్తున పన్నుల రూపంలో పిండేస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు… అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులను నాలుగు సార్లు పెంచారు. కరెంట్ చార్జీలు పెంచారు. చివరికి… ఫైబర్ నెట్ చార్జీలు కూడా పెంచారు. దాదాపుగా.. ప్రతీ పన్ను పెంచారు. ఇక మద్యం గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక్క ఏడాదిలోనే మద్యం ద్వారా ప్రజల నుంచి రూ.20వేల కోట్లను ప్రభుత్వం పిండుకుంటోంది. ఈ ఆదాయం మొత్తాన్ని ఇప్పటికే తాకట్టు పెట్టేసి వేరే అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు అలా చేయడం చట్ట విరుద్ధమన్న చర్చ నడుస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం.. ఏవో జీవోలు చూపించి… బోలెడంత అప్పు చేసే సామర్ధ్యం ఉందని బ్యాంకుల వద్దకు వెళ్తోంది. భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పు చేసేశారు. ఇక ఏ ఆదాయాన్ని చూపి ఇక అప్పులు చేస్తారో తెలియాల్సి ఉంది.

అప్పులు చేసి ఆస్తులమ్మినా ఖజానా ఖాళీనే..! ఇప్పుడేం చేస్తారు..?

సంపాదించే వాడికే ఖర్చు పెట్టే అర్హత ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఏపీ సర్కార్.. సంపాదన అంటే.. పన్నులు పెంచడం… ఆస్తులు అమ్మడం అనుకుంటోంది. వివిధ రకాల పన్నులను భారీగా పెంచేసిన ఏపీ సర్కార్ ఇప్పుడు ఖరీదైన భూముల అమ్మకంపై కన్నేసింది. మొదటి విడతగా గుంటూరు, విశాఖల్లోని స్థలాలను అమ్ముతోంది. మూడు వందల కోట్ల ఆదాయం కళ్ల జూసేందుకు సిద్ధమవుతుంది. కోర్టుల్లో కేసులు ఉన్నా… ఎవరైతే మాకేంటి అనుకునే ప్రభుత్వం.. అమ్మక మానదు. ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆదాయం పెంచుకుని దానికి తగ్గట్లుగా అభివృద్ధిని సాధించడమే పాలకుడి బాధ్యత. కానీ ఇక్కడ రివర్స్‌లో జరుగుతోంది. ఎక్కడ దొరికితే అక్కడ.. ఎంత వడ్డీకి దొరికితే అంత వడ్డీకి తీసుకొచ్చి.. ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియని పరిస్థితి. పీకల మీదకు వచ్చినా అసలు విషయం ప్రభుత్వ పెద్దలు ఇంకా గుర్తించలేదు. ఓ వైపు అప్పులు.. మరో వైపు పెండింగ్ బిల్లులు… ఎంత ఆదాయం వచ్చినా సరిపోని పరిస్థితి. దీనికి తోడు ఏ మాత్రం హంగామా తగ్గకుండా వేల కోట్ల రూపాయల పనులకు పరిపాలనా అనుమతులు. ఈ భారం అంతా ప్రజలపైనే పడబోతోంది. అది ఏ రూపంలో అనేది తేలాల్సి ఉంది. నేరుగా పన్నుల ద్వారా పిండేస్తారా..? లేక ప్రాజెక్టుల్లాంటి ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తారా అన్నది ఇప్పుడు కీలకం.

మొత్తంగా ఏపీ పపరిస్థితి “ఉరుకులాట – ఉత్తశాట..!” అయిందని క్లుప్తంగా చెప్పుకుంటే అందులో అతిశయోక్తి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇది కూడా కేంద్రం ర్యాంకులే.. బీహార్ కంటే ఏపీ ఘోరం !

2020 నాటికి ప్రామాణికంగా తీసుకున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానానికి వచ్చిందని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కేంద్రం స్టార్టప్స్ ఎకో సిస్టం బాగున్న రాష్ట్రాలకు ర్యాంకులు...

విజయసాయిరెడ్డి తండ్రి హంతకుడు – ఇవిగో రఘురామ బయట పెట్టిన డీటైల్స్ !

విజయసాయిరెడ్డి తండ్రి సుందరరామిరెడ్డి కూడా హంతకుడని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఇటీవల విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో అత్యంత దారుణంగా బూతులు తిడుతూండటంతో దానికి పోటీగా రఘురామ కృష్ణరాజు కూడా అదే లాంగ్వేజ్...

ఇద్దరు మహానుభావులని గుర్తు తెచ్చిన… సీతా రామం

మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని లోటు పూడ్చలేనిది. చివర్లో ఆయన పాటలు పాడటం తగ్గించేసిన్నప్పటికీ ఆయన తప్పా మరో గాయకుడు వద్దు అనుకునే పాటలు, సందర్భాలు అనేకం. అయితే ఇప్పుడా ఆయన...
video

మెగా లుక్‌: గాడ్ ఫాద‌ర్ ఆగ‌మనం

https://www.youtube.com/watch?v=WuCjEeyQrq8 మ‌ల‌యాళంలో పెద్ద విజ‌యాన్ని అందుకొన్న చిత్రం... లూసీఫ‌ర్‌. తెలుగులో చిరంజీవితో గాడ్ ఫాద‌ర్ గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close