తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయింది. సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై అందరూ విశ్లేషిస్తారు. కానీ ప్రతిపక్ష పనితీరును కూడా విశ్లేషించాలి. తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అంత బలం సాధించుకుంది. మరి రెండేళ్లలో తన బలాన్ని ఉపయోగించి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టగలిగిందా.. ప్రజాదరణను పెంచుకునే ప్రయత్నం చేసిందా అంటే దిక్కులు చూడాల్సిందే. కేసీఆర్ పూర్తిగా రెండేళ్లుగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. ఆయన బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు. కానీ రేవంత్ కు సీఎం పదవి ఎలా కొత్తగా అనిపిస్తుందో..కేటీఆర్‌కు విపక్ష పదవి అలాగే అనిపిస్తోంది. ఆయన ఆన్ లైన్ నాయకుడు అయ్యారు. ఆఫ్ లైన్ లో మాత్రం ఇంకా తాను సమర్థుడినని నిరూపించుకోలేకపోయారు.
కేసీఆర్ పాత్రలో కేటీఆర్
రేవంత్ రెడ్డిని తన సమకాలికుడిగా చూసేందుకు కేసీఆర్ రెడీగా లేరు. అదే సమయంలో ఆయనకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదని చెబుతున్నారు. అందుకే ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. అయితే పార్టీలో సమస్యలు రాకుండా ప్రతిపక్ష నేతగా తానే వ్యవహరిస్తున్నారు. కానీ బాధ్యతలు మాత్రం కేటీఆర్ తీసుకున్నారు. పార్టీని నడుపుతూ.. ప్రభుత్వంపై పోరాటాన్ని చేయాల్సిన బాధ్యత తీసుకున్నారు. రెండేళ్లుగా ఆయన పోరాడుతూనే ఉన్నారు.కానీ కేసీఆర్ లాంటి నేత రోల్ తీసుకున్నప్పుడు మెప్పించాలంటే చాలా కష్టం. అదే జరుగుతోంది. ఆయన కేసీఆర్ ను మరిపించలేరు.. ప్రజలకు ప్రత్యామ్నాయ నేత అనే నమ్మకం కూడా కలిగించలేకపోతున్నారు. దానికి సాక్ష్యం.. రెండు అసెంబ్లీ స్థానాలను కోల్పోవడం.. లోక్ సభలో ప్రాతినిధ్యం సాధించలేకపోవడం.
ఆన్ లైన్ రాజకీయాలతోనే టైం పాస్
బీఆర్ఎస్ ఓడిపోయాక..కేటీఆర్ ఓ స్థిరనిర్ణయానికి వచ్చారు. తమకు యూట్యూబ్ చానళ్లు లేకే ఓడిపోయామని అన్నారు. ఆయన తప్పుగా ..లోపంగా భావించిన దాన్ని సరి చేసుకున్నారు. భారీ ఖర్చుతో యూట్యూబ్,సోషల్ మీడియా చానళ్లు రన్ చేస్తున్నారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో వీరందరూ కలిసి ఇక ఏముంది బీఆర్ఎస్ గెలుచుడే అని ప్రచారం చేశారు. చివరికి ఏమయింది.. పాతిక వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది.అది రియాలిటీ. సోషల్ మీడియాతోనే రాజకీయాలు చేస్తే.. తనను తాను మోసం చేసుకున్నట్లు అయింది. గ్రౌండ్ లో పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. మొత్తం రెండేళ్ల రాజకీయం అలాగే నడిచింది. తాము ఇంకా ప్రతిపక్ష పాత్రను పోషించతడం లేదని ఓ సందర్భంలో జగదీష్ రెడ్డి కూడా నేరుగానే చెప్పారు.
రేవంత్ ను ఎదుర్కోవాలంటే కేటీఆర్ చేయాల్సింది చాలా ఉంది !
రేవంత్ …కేసీఆర్ ను ఓడించారు. ఆ విషయం గుర్తు పెట్టుకునే ఆయనకు కౌంటర్ రాజకీయాలు చేయాలి. అంతే కానీ తక్కువ అంచనా వేసి.. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టి..తిట్టించేసి రాజకీయాలు చేస్తే మిస్ ఫైర్ అవుతాయి. సీఎంవోలో కోవర్టుల్ని పెట్టుకుని సమాచారం తెప్పించుకుంటే బండి నడిచిపోదు. రేవంత్ కింది ఎదిగిన రాజకీయ నేత. ఆయన జాక్ పాట్ కొట్టి రాలేదు. ప్రతి దశలోనూ కిందకు కొడితే..పైకి ఎదిగి వచ్చారు. కేటీఆర్ కు ఎప్పుడూ అలాంటి స్ట్రగుల్ రాలేదు. వస్తేనే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. అలాంటి అవకాశం ఇవ్వాలని కూడా రేవంత్ అనుకోవడంలేదు. అదే ఆయన తెలివి. కేటీఆర్ ఈ విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రెండేళ్లలో ఆయన తన వ్యహాల ప్రకారం రాజకీయాలు చేశానని అనుకుంటూ ఉండవచ్చు కానీ ఆయన చేసింది రేవంత్ రెడ్డి తరపున రాజకీయమేనని అనుకోవచ్చు.