రివైండ్ 2018: 170లో 15 హిట్లు.. ఇది స‌రిపోతుందా?

చ‌ర‌ణ్ సినిమా వంద కోట్లు కొట్టింది
మహేష్ కూడా సెంచ‌రీ చేశాడు
గీత గోవిందం లాంటి చిన్న సినిమా రూపాయికి ప‌ది రూపాయ‌ల లాభం తెచ్చుకుంది.
ఆర్‌.ఎక్స్‌100 అయితే.. దుమ్ము దులిపేసింది.

ఇవ‌న్నీ చూసి.. అరె… తెలుగు సినిమా క‌ళ‌క‌ళ‌లాడిపోతోంది అనుకోవ‌డానికి వీల్లేదు. ఇవ‌న్నీ పైపైన మెరుపులే. మేడి పండు లోప‌ల… పురుగుల్లాంటి చాలా ఫ్లాపులున్నాయి. ఈ మాత్రం హిట్లు చూడ‌డానికి ప‌రిశ్ర‌మ చాలా చేదు గుళిక‌ల్ని మింగింది. ఈ యేడాది 170 సినిమాలు విడుద‌లైతే అందులో హిట్ టాక్ తెచ్చుకుని, నిర్మాత‌కు డ‌బ్బులు మిగిల్చిన‌వి 15 లెక్క తేలాయి. అంటే… దాదాపు 150 సినిమాల నిర్మాత‌లు న‌ష్టాల‌నే చ‌విచూశార‌న్న‌మాట‌. క‌నీసం 10 శాతం కూడా విజ‌యాలు ద‌క్క‌డం లేద‌న్న‌మాట‌. ఇది నిజంగానే… చింతించాల్సిన విష‌యం.

2018ని ఒక్క‌సారి రివైండ్ చేస్తే ‘జైసింహా’, ‘భాగ‌మ‌తి’, ‘ఛ‌లో’, ‘గీత గోవిందం’, ‘రంగ‌స్థ‌లం’, ‘భ‌ర‌త్ అనే నేను’, ‘మ‌హాన‌టి’, ‘ఆర్‌.ఎక్స్ 100’, ‘తొలి ప్రేమ‌’,’గూఢ‌చారి’, ‘టాక్సీవాలా’, ‘అరవింద సమేత’ ఇవ‌న్నీ హిట్ అనిపించుకున్నాయి. టాలీవుడ్‌ ఎన్ని హిట్లు చ‌విచూసిందో అంత‌కంటే ఎక్కువ డిజాస్ట‌ర్లు త‌గిలాయి. క‌నీసం 20 శాతం పెట్టుబ‌డికి కూడా నోచుకోలేని సినిమాలెన్నో. సినిమాకేమో హిట్టు టాక్ – నిర్మాత చూస్తే అప్పుల్లో ఉంటాడు. ఇలాంటి ఫ‌లితాలు, ప‌రిణామాలూ 2018లోనూ చూసింది తెలుగు సీమ‌. ఇదంతా ఎందుకు జ‌రుగుతుంది? ఎక్క‌డ త‌ప్పు చేస్తున్నాం? అనే విష‌యాన్ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆలోచించుకోవాలి. ఫాల్స్ ప్రెస్టేజీలో ప‌డిపోయిన కొంత‌మంది.. `మా సినిమా హిట్టు అంటే హిట్టు` అని డ‌బ్బా కొట్టుకుంటున్నారు. ఇంకొంత మంది త‌మ మార్కెట్ స్థాయికి మించి ఖ‌ర్చు పెడుతున్నారు. అదేంటి? మీ మార్కెట్ ఇంత లేదు క‌దా? అని అడిగితే `బాహుబ‌లి ఎంత సంపాదించింది? గీత గోవిందం బ‌డ్జెట్ ఎంత‌` అంటూ లాజిక్కులు తీస్తున్నారు. అన్ని సినిమాలూ బాహుబ‌లిలూ, గీతా గోవిందాలూ అయిపోతాయా? అయిపోతే ప‌రిశ్ర‌మ ఇలా ఎందుకు ఉంటుంది..?

ప‌రిశ్ర‌మ‌లో విజ‌యాల సంఖ్య ఎప్పుడూ ప‌ది శాతానికి మించి లేద‌న్న‌ది వాస్త‌వం. ఈసారి ఆ మార్క్ కూడా చేరుకోలేక‌పోయాం. నిర్మాత‌లు పెరుగుతున్నారన్న విష‌యం చిన్న సినిమాల సంఖ్య‌ని చూస్తే అర్థ‌మ‌వుతోంది. అయితే.. వ‌చ్చిన‌వాళ్లు వ‌చ్చిన‌ట్టే వెన‌క్కి వెళ్లిపోతున్నారు. వాళ్లు నిల‌బ‌డితేనే క‌దా… మ‌రో సినిమా తీసేది. ఈ యేడాది చిన్న సినిమాల ప‌రిస్థితి మ‌రీ గొప్ప‌గా ఏం లేదు. అక్క‌డ‌క్క‌డా ఆర్‌.ఎక్స్ 100 లాంటి మెరుపులు ఒక‌ట్రెండు క‌నిపిస్తున్నాయి. ఇలాంటి సినిమాల వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌కు ప‌రోక్షంగా అప‌కార‌మే జ‌రుగుతోంది. ఆర్.ఎక్స్ 100 ఆడింది క‌దా అని అదే ఫార్ములాలో కుట్ట‌లు కుట్ట‌లుగా సినిమాలు వచ్చి ప‌డిపోతుంటాయి. అందులో స‌గానికి పైగా సినిమాలు విడుద‌ల‌కు కూడా నోచుకోవు. స‌గంలో అయిపోయిన సినిమాలు కొన్న‌యితే.. థియేట‌ర్లు దొర‌క్క ఒక‌ట్రెండు చోట్ల విడుద‌లై `మ‌మ` అనిపించుకున్న‌వి కొన్ని. ఇంకొన్ని సినిమాలు బాగున్నా.. పెద్ద సినిమాల తాకిడికి త‌ట్టుకోలే అల్లాడిపోతుంటాయి. ఇలా చిన్న సినిమా క‌ష్టాల గురించి క‌డుపు చింపుకుంటే… స్క్రీన్‌పై ప‌డుతుంది.

పైర‌సీ, విడుద‌ల‌కు ముందే సినిమా లీకేజీ.. చిత్ర‌సీమ‌కు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. గీత గోవిందంలోని కొన్ని స‌న్నివేశాలు ముందే లీకైపోయాయి. టాక్సీవాలా అయితే ఏకంగా సినిమానే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆయా సినిమాలు విడుద‌లై నిల‌బ‌డ్డాయి కాబ‌ట్టి, డ‌బ్బులు తిరిగి రాబ‌ట్టుకున్నాయి కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే నిర్మాత‌ల ప‌రిస్థితేంటి? ఈ విష‌య‌మై తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఎన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఫ‌లితం ఉండడం లేదు. 2019లో ఇలాంటి దారుణాలు జ‌రక్కుండా ఇంకాస్త క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సివుంది. విడుద‌ల తేదీల విష‌యంలోనూ, గుంపుగా నాలుగైదు సినిమాల్ని వ‌దిలేసే విష‌యంలోనూ నిర్మాత‌లు ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తే… అది క‌చ్చితంగా సినిమాల‌కు దెబ్బే. బాగున్న సినిమాలు కూడా ఆ గుంపులో కొట్టుకుపోతుంటాయి. విడుద‌ల తేదీల విష‌యంలో నిర్మాత‌లు, హీరోలు ఇగోల్ని వ‌దులుకోవ‌డం మిన‌హా మ‌రో మార్గం లేదు.

శాటిలైట్ మార్కెట్ ప‌రిస్థితి ఘోరంగా ఉంది. పెద్ద సినిమాల‌కు, హిట్ చిత్రాల‌కు మిన‌హా శాటిలైట్ లేదు. ఈ విష‌యాన్ని చిన్న సినిమా నిర్మాత‌లు గుర్తుంచుకోవాలి. ‘సినిమా అమ్మ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు.. శాటిలైట్ రైట్స్ రూపంలో డ‌బ్బులు వెన‌క్కొస్తాయి’ అన్న ధీమా అస్స‌లు ప‌నికిరాదు. ఈమ‌ధ్య హిందీ మార్కెట్ పెరిగింద‌న్న మాట వాస్త‌వం. హిందీ డ‌బ్బింగ్ రేట్ల రూపంలో ఆక‌ర్ష‌ణీయ‌మైన మొత్తం నిర్మాత‌ల చేతికి అందుతోంది. అయితే ఇది అన్ని సినిమాల‌కూ ఒకేలా ఉండ‌ద‌ని గుర్తించాలి. ఈ మార్కెట్ ఎంత చ‌ప్పున లేచిందో.. అంతే త్వ‌ర‌గా ప‌డిపోయే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే చాలా అగ్ర నిర్మాణ సంస్థ‌లు దుకాణాలు మూసేశాయి. పెద్ద పెద్ద నిర్మాత‌లు వేర్వేరు వ్యాపారాల‌లో స్థిర‌ప‌డ్డారు. రెగ్య‌లర్‌గా సినిమాలు తీసేవాళ్లు ప‌దిమందికి మించ‌రు. అంటే చిత్ర‌సీమ‌కు కొత్త నిర్మాత‌లే కొంగు బంగారం. ఇలా ప‌ది ప‌ర‌క విజ‌యాలు సాధిస్తుంటే.. వాళ్ల‌ని కాపాడుకునేదెలా? ఇప్పుడు కావాల్సింది.. స‌రికొత్త వ్యూహం. పాత త‌ప్పుల్ని స‌రిద్దిద్దుకుంటూ ముందుకు సాగే విధానం. పాత చింత‌కాయ్ ప‌చ్చ‌డి క‌థ‌ల్ని, ఫార్ములాల్నీ పూర్తిగా ప‌క్క‌న పెట్టి.. ఈసారి కొత్త‌గా రిఫ్రెష్ అవ్వాలి. అదంతా ద‌ర్శ‌కులు, క‌థ‌కుల చేతుల్లో ఉంది. కొత్త త‌రాన్ని, కొత్త‌ద‌నాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త నిర్మాత‌లు తీసుకోవాలి. అప్పుడే.. ఈ ఫ‌లితాల‌లో మార్పు క‌నిపిస్తుంది. తెలుగు సినిమా భ‌విష్య‌త్తు ఉజ్వ‌లంగా ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close