బీహార్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం రాను రాను తేడాగా మారుతోంది. బలం లేకపోయినా సీట్లు తీసుకుని ఓడిపోయి అధికారాన్ని ఇతర పార్టీలకు కట్టబెట్టే పరిస్థితి తెచ్చుకుంటోంది. బీహార్ లో గత ఎన్నికల్లో అదే జరిగింది. దాంతో ఆర్జేడీ ఇప్పుడు జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మాట్లాడకుండా తాము ఇచ్చిన సీట్లలో పోటీ చేసి మితృత్వాన్ని కాపాడుకోవాలని లేకపోతే.. ఒంటరి అయిపోతారని హెచ్చరిస్తోంది. దీనంతటికి కారణం కాంగ్రెస్ పార్టీ కక్కుర్తినే.
గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాపం
2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పోటీ చేసి 19 సీట్లు గెలిచింది. బలం లేకపోయినా పట్టుబట్టి మరీ సీట్లు తీసుకుని ఓడిపోవడంతో లాలూ ప్రసాద్ అప్పుడే గుస్సా అయ్యారు. ఇప్పుడు అదే తప్పు చేయాలని కాంగ్రెస్ అంటోంది. తమకు గతంలో కేటాయించిన 70 సీట్లను కేటాయించాలని అంటోంది. కానీ ఒంటరిగా అయినా పోటీకి సిద్ధమే కానీ ఈ సారి అలాంటి చాన్స్ లేదని ఆర్జేడీతో స్పష్టం చేస్తోంది. ఆర్జేడీ 2020లో 144 సీట్లకు పోటీ చేసి 75 సీట్లు గెలిచింది, 17 సీట్లు ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోయిన చోట్ల మార్జిన్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
బెట్టు చేస్తున్న కాంగ్రెస్కు తేజస్వి వార్నింగ్
బీహార్లో ఉన్న మొత్తం 243 సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమేనని తేజస్వి యాదవ్ ప్రకటించడంతో ఇండీ కూటమిలో పరిస్థితి దిగజారిపోయిందని అందరికీ అర్థమైపోయింది. రాహుల్ గాంధీ ఓటు చోరీ యాత్ర చేసి వెళ్లిన తరవాత కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆర్జేడీ ఇలా వ్యవహరించడం రాహుల్ గాంధీకి ఇబ్బందికరమే. అయినా మొహమాటపడకూడదని లాలూ కుటుంబం డిసైడ్ చేసుకుంది. ఈ సారి కూడా అధికారం అందుకోకపోతే లాలూ కుటుంబ రాజకీయం మరుగునపడే ప్రమాదం ఉంది. అందుకే రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు.
కాంగ్రెస్ తగ్గాల్సిందే .. మరో దారి లేదు !
కాంగ్రెస్ పార్టీ బీహార్ లో ఒంటరిగా పోటీ చేస్తే.. కనీస మాత్రం సీట్లు గెలిచే పరిస్థితి లేదు. కానీ తమది జాతీయ పార్టీ అని.. తాము చెప్పినట్లుగా చేయాలన్నట్లుగా డీల్ చేస్తోంది. అక్కడే తేడా వస్తోంది . కానీ బీహార్ వరకూ లాలూ చెప్పినట్లే రాజకీయం చేయాల్సి ఉంటుంది. అందుకే కాంగ్రెస్ కు మరో దారి లేదు. ఎన్నిసీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకుని పోటీ చేయాల్సి ఉంటుంది. ఇండీ కూటమిలో.. ఆర్జేడీ సీట్లు పంచాల్సింది కాంగ్రెస్ కు మాత్రమే కాదు.. కమ్యూనిస్టులతో పాటు మరికొన్ని పార్టీలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ సీట్ల షేర్ ఇంకా ఇంకా తగ్గిపోయే చాన్స్ ఉన్నాయి.
కాంగ్రెస్ మిత్రుల్ని దూరం చేసుకుని హర్యానా, ఢిల్లీల్లో ఘోరపరాజయం పాలైంది. బీహార్ లో మిత్రుల్ని నిలుపుకోవాలంటే.. చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది.