ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. జూబ్లిహిల్స్ ఎన్నికల ఫలితంపై రేవంత్ రెడ్డిని పొగడటానికి ప్రాధాన్యమిస్తూనే ఆయనకు భవిష్యత్ దిశానిర్దేశం చేసేందుకు ఈ వారం కొత్తపలుకులో ప్రయాసపడ్డారు. చివరికి ఆయన కూడా జూబ్లిహిల్స్ పార్టీ వెనుకబడిపోయి ఉందని.. చివరికి రేవంత్ లాక్కొచ్చారని చెప్పేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో ఓ నియోజకవర్గంలో లక్షల మంది ప్రజల్ని మూడు, నాలుగు రోజుల్లోమార్చలేరన్న సంగతిని మాత్రం ఆయన చెప్పలేకపోయారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కారణాలుగా.. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం, మజ్లిస్ సపోర్టు అని ఆర్కే చెప్పారు. ముందుగానే నవీన్ యాదవ్ ను ఖరారు చేసి పని చేస్కోమన్నారని.. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కూడా మజ్లిస్ అని తన ఆర్టికల్ లో అందరూ చెప్పుకునే మాటల్ని కొత్తగా చెబుతున్నట్లుగా ఆర్కే చెప్పారు. ఇదే నిజం అయితే కాంగ్రెస్ పార్టీ అసలు పోలింగ్ కొద్ది రోజుల ముందు వరకూ వెనుకబడింది అన్న వాదన అంతా డొల్లే. ఎందుకంటే జూబ్లిహిల్స్ లో మజ్లిస్ బలం.. నవీన్ యాదవ్ వ్యక్తిగత బలం.. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయక ఓట్లు.. అధికార పవర్.. ఇన్ని కలిసిన తర్వాత వెనుకబడిపోవడం అనేది ఉంటుందా? . ఆర్కే ఈ లాజిక్ మిస్సయ్యారు.
పోనీ ఎదుటి పార్టీ బలంగా ఉందా..?. బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలంగా లేదు. క్యాడర్ కూడా తక్కువ. ఉన్న చాలా మంది.. బాబా ఫసియుద్ధీన్ లాంటి కరుడుగట్టిన బీఆర్ఎస్ సపోర్టర్లు కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. ఓ రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ప్లస్ పాయింట్ లేదు.అయినా ఆ పార్టీ పది శాతం ఓట్లతో పోలింగ్ కు ముందు లీడ్ లో ఉందని ఎందుకు రుద్దుతున్నారో ఆర్కేకే తెలియాలి. బహుశా ఆయన పత్రికలో కూడా కాంగ్రెస్ గెలుపు డౌటే అని రాసిన కథనాలను ఇలా కవర్ చేసుకుంటున్నారమో?
ఈ గెలుపుతో కేటీఆర్ కు అహంకారం తగ్గలేదని ప్రజలు అనుకుంటున్నారని తేల్చారు. కేసీఆర్ కు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి బయటకు రావడం లేదని..కుదురుకుని వస్తే బీఆర్ఎస్ బతుకుతుంది..లేకపోతే కేటీఆర్ చేతిలోనే నిర్వీర్యమైపోతుందని ఆర్కే పరోక్షంగా జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వైఎస్ తరహాలో పార్టీ, ప్రభుత్వంపై పట్టు పెంచుకోవాలని సలహాలు ఇచ్చారు. అలా అయ్యే వాతావరణం కూడా ఉందని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ ను కాదనే ధైర్యం హైకమాండ్ కు ఉండదని కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా ఆర్కే..గతంలో తాను అన్న మాటల్నే రివర్స్ లో కవర్ చేసుకోవడానికి ఎక్కువ వాక్యాలు రాయాల్సి వచ్చింది.



