సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉంటూ ముఖ్యమంత్రి, గవర్నర్ వంటి అత్యున్నత పదవులు నిర్వహించిన కె.రోశయ్య మొన్ననే తమిళనాడు గవర్నర్ గా పదవీ విరమణ చేశారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితం చాలా సంతృప్తికరంగాసాగిందని కనుక ఇక కాంగ్రెస్ పార్టీలో నుంచి, రాజకీయాలలో నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయించుకొన్నానని చెప్పారు. ఈ వయసులో రాజకీయాలలో పాల్గొనే ఓపిక, ఆసక్తి రెండూ లేవు కనుకనే తను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చాలా మార్పు వచ్చిందని, ఈ వయసులో వాటిలో తాను ఇమడలేనని కనుక వాటికి దూరంగా ఉంటూ తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకొంటున్నట్లు చెప్పారు.
రోశయ్య చాల మంచి నిర్ణయమే తీసుకొన్నారని చెప్పవచ్చు. రాజకీయ నేతలు చాలా మంది తమ వారసులని తమ స్థానంలో ప్రవేశపెట్టాలనో లేదా మరో కారణం చేతో వయసు మీరుతున్నప్పటికీ రాజకీయాలలో కొనసాగుతూ ఇబ్బందిపడుతుంటారు…వారి వలన ప్రజలకి కూడా నష్టం కలుగిస్తుంటారు. ఉదాహరణకి తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష నేత కరుణానిధినే పేర్కొనవచ్చు. ఆయన ఏదోవిధంగా ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటికీ ఎప్పుడూ వీల్- చైర్ కి, మంచానికే పరిమితం అయినందున శాసనసభ సమావేశాలకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. మన దేశంలో కాటికి కాళ్ళు జాపుకొని కూర్చొన్న వృద్ద రాజకీయ నేతలు చాలా మంది ఇంకా రాజకీయాలు, పదవులు, అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. రోశయ్య వారిలో ఒకరిగా మారకుండా తన గౌరవాన్ని కాపాడుకొంటూ స్వచ్చందంగా రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అందుకు ఆయనని అభినందించవలసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వృద్ద రాజకీయ నేతలు కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల నుంచి తప్పుకొన్నట్లయితే వారి స్థానంలో యువత ప్రవేశించగలుగుతుంది.