ఈనెల 12న రావాల్సిన సినిమాల్లో ‘మోగ్లీ’ ఒకటి. కాకపోతే… ‘అఖండ 2’ వల్ల ఒక్క రోజు ఆలస్యంగా వస్తోంది. ‘అఖండ 2’.. 12న రిలీజ్ అవుతుండడంతో.. ‘మోగ్లీ’ 13న ఫిక్సయ్యింది. 12న ప్రీమియర్లు మొదలైపోతాయి. ఆ లెక్కన చూస్తే.. డిసెంబరు 12 డేట్ మోగ్లీ కూడా వదులుకోనట్టే.
ఈలోగా ‘మోగ్లీ’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాకపోతే.. ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. టీజర్, ట్రైలర్లలో ఏ ఇచ్చేంత కంటెంట్ ఏమీ కనిపించలేదు. బహుశా.. హింస ఎక్కువై ఉండొచ్చు. దాన్ని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం దాచి పెట్టి టీజర్, ట్రైలర్ కట్ చేసి ఉండొచ్చు.
‘ఏ’ సర్టిఫికెట్ రావడం నేరం కాదు.. పాపం కాదు. కాకపోతే.. ఇందులో రామాయణం రిఫరెన్స్ వుంది. చివర్లో హనుమంతుడి రాకకు సంబంధించిన కొన్ని డైలాగులు మెటాఫర్ గా వాడారు. రామాయణం స్ఫూర్తి ఈ కథలో ఉందని చిత్రబృందం కూడా చెబుతోంది. అలాంటి కథకు ఏ సర్టిఫికెట్ రావడం మాత్రం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమా నిడివి కూడా 2 గంటల 40 నిమిషాలు. లెంగ్త్ పరంగా కూడా పెద్ద సినిమానే ఇది. దర్శకుడిగా సందీప్ కు ఇది రెండో సినిమా. మొదటి చిత్రం ఓటీటీకే పరిమితం అయ్యింది. ఈ సినిమాతో తన కమర్షియల్ క్యాపబులిటీ ఏమిటన్నది తేలిపోతుంది.
