ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా ఇతరులకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన అభియోగాల నుంచి వీరిని విముక్తి చేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ సంచలన తీర్పు వెలువరించారు. నిందితులపై మోపిన అవినీతి ఆరోపణలను ప్రాథమికంగా ధృవీకరించడానికి దర్యాప్తు సంస్థ తగిన ఆధారాలను సమర్పించడంలో విఫలమైందని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ సమర్పించిన వేల పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టు నిశితంగా పరిశీలించింది. నిందితుల మధ్య కుట్ర జరిగిందని లేదా క్విడ్ ప్రో కో జరిగిందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కేవలం ఊహల ఆధారంగా వ్యక్తులను విచారించలేమని, దర్యాప్తు సంస్థ సేకరించిన సాక్ష్యాలు వారిపై నేరారోపణలు చేయడానికి సరిపోవని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో కేజ్రీవాల్, సిసోడియాతో పాటు ఈ కేసులో ఉన్న మొత్తం 23 మందికి క్లీన్ చిట్ లభించింది.
ఈ తీర్పు ఆమ్ ఆద్మీ పార్టీకి , కవితతో పాటు ఇతర నిందితులకు నైతికంగా , రాజకీయంగా పెద్ద విజయం అని చెప్పవచ్చు. గత రెండేళ్లుగా ఈ కేసు కారణంగా పార్టీ అగ్రనేతలు జైలు శిక్ష అనుభవించడమే కాకుండా, పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, తమ పార్టీని అణచివేయడానికి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్నారని ఆప్ మొదటి నుండి చేస్తున్న వాదనలకు ఈ కోర్టు తీర్పు బలాన్ని చేకూర్చింది.
సీబీఐకి ఈ తీర్పు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. భారీ ప్రచారం పొందిన ఈ కేసులో నిందితులు డిశ్చార్జ్ కావడం దర్యాప్తు సంస్థ పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తింది. అయితే, ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఆప్ శ్రేణులు ఈ తీర్పును పెద్ద ఎత్తున వేడుకగా జరుపుకుంటున్నాయి. కొత్త పార్టీ ప్రారంభించాలనుకుంటున్న కవితకూ తనపై ఉన్న ఓ నింద తొలగిపోయినట్లయింది.
