ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న వేళ, ఇరాన్ దాదాపు ఒంటరి పోరాటం చేస్తోంది. ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగినా ఇరాన్ కోసం రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలు దౌత్యపరమైన మద్దతు ఇస్తున్నప్పటికీ, నేరుగా యుద్ధ రంగంలోకి దిగలేదు. ఫలితంగా ఇరాన్ ఒంటరి పోరాటం చేస్తోంది.
రష్యా అశక్తత – ఉక్రెయిన్ చిక్కులు
రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్‌తో ఐదేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో కూరుకుపోయింది. తన సైనిక శక్తిని, ఆయుధ సంపత్తిని ఇప్పటికే అక్కడ భారీగా మోహరించిన పుతిన్, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో మరో యుద్ధ రంగాన్ని తెరిచే స్థితిలో లేరు. ఇరాన్ నుంచి గతంలో డ్రోన్లు తీసుకున్న రష్యా, ఇప్పుడు ఇరాన్‌ను కాపాడటానికి అమెరికా, ఇజ్రాయెల్ వంటి శక్తులతో నేరుగా తలపడితే తన ఉనికికే ప్రమాదమని భావిస్తోంది. అందుకే ఇది సార్వభౌమాధికారంపై దాడి అని ఖండిస్తూ కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది.
చైనా ఆర్థిక ప్రయోజనాలు
చైనా ఎప్పుడూ తన ఆర్థిక ఎదుగుదలకే ప్రాధాన్యత ఇస్తుంది. అమెరికాతో నేరుగా యుద్ధం చేయడం వల్ల తన గ్లోబల్ ట్రేడ్ దెబ్బతింటుందని బీజింగ్ భయం. చైనాకు కావాల్సింది చౌకగా దొరికే ఇరాన్ చమురు మాత్రమే. యుద్ధం పెరిగితే చమురు సరఫరా ఆగిపోయి, చైనా తయారీ రంగం కుప్పకూలుతుంది. అందుకే చైనా శాంతి చర్చలు జరపాలి అని చెబుతూనే, అమెరికాను నేరుగా ఢీకొనకుండా జాగ్రత్త పడుతోంది. ఇరాన్ కోసం తన ఆర్థిక సామ్రాజ్యాన్ని పణంగా పెట్టడానికి చైనా సిద్ధంగా లేదు.
కూటమి లేని స్నేహం – కేవలం వ్యాపార బంధం
రష్యా, చైనా, ఇరాన్‌ల మధ్య ఉన్నది వ్యూహాత్మక భాగస్వామ్యం మాత్రమే కానీ, నాటో తరహాలో ఒకరిపై దాడి జరిగితే అందరం కలిసి పోరాడాలి అనే ఒప్పందం ఏదీ లేదు. ఇరాన్‌కు ఆయుధాలు అమ్మడం, ఇంధనం కొనడం వరకు ఈ దేశాల బంధం పరిమితం. క్లిష్ట సమయంలో ఇరాన్ కోసం రక్తం చిందించడానికి ఈ రెండు దేశాలు సిద్ధంగా లేవు. దీనివల్ల ఇరాన్ తన ప్రాక్సీ దళాలైన హిజ్బుల్లా, హౌతీల మీద మాత్రమే ఆధారపడాల్సి వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌కు సహకరించే దేశాలపై కఠిన ఆంక్షలు ఉంటాయి అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రష్యా, ఎగుమతులపై ఆధారపడే చైనా.. అమెరికాతో నేరుగా వైరం పెట్టుకుని మరిన్ని ఆంక్షలు కొనితెచ్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా, ఇరాన్ ఎంతటి సంక్షోభంలో ఉన్నా, ఈ అగ్రరాజ్యాలు కేవలం సురక్షిత దూరం నుంచి విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాయి తప్ప, యుద్ధ విమానాలను పంపడం లేదు.


