రష్యా నుంచి పెట్రోల్ కొంటున్నారని ట్రంప్ ఇండియా దిగుమతులపై పన్నులు పెంచారు. ఇరాన్ పై దాడుల తర్వాత రష్యా నుంచి కొనుక్కోవచ్చని వెసులుబాటు ఇచ్చారు. కానీ ఇప్పుడు అసలు రష్యా.. తాము అమ్మేది లేదని ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రకటించడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. చమురు ధరలను స్థిరీకరించడం, దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యమని రష్యా చెబుతోంది.
రష్యాలో ప్రస్తుతం రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులు జరుపుతోంది. అలాగే దేశీయంగా పెరుగుతున్న ఇంధన డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రష్యా అంతర్గత మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరగకుండా అడ్డుకోవడం వారి ప్రధాన ఉద్దేశం. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా ఉన్న రష్యా ఎగుమతులు నిలిపివేస్తే, గ్లోబల్ సప్లై చైన్‌లో లోటు ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది.
భారత్ తన చమురు అవసరాల్లో రష్యా నుంచి భారీగానే దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రష్యా విధిస్తున్న నిషేధం పెట్రోల్ అంటే ప్రాసెస్ చేసిన ఇంధనం ఎగుమతులపై మాత్రమే, క్రూడ్ ఆయిల్ పై కాదు. భారత్ ప్రధానంగా రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుని, మన దేశంలోని రిఫైనరీలలో పెట్రోల్, డీజిల్‌గా మారుస్తుంది. కాబట్టి, ముడి చమురు సరఫరాకు ఆటంకం కలగనంత వరకు భారత్‌కు తక్షణమే పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశం తక్కువ.
ముడి చమురు సరఫరా కొనసాగినప్పటికీ, అంతర్జాతీయంగా పెట్రోల్ ఎగుమతులు తగ్గడం వల్ల గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే, దాని ప్రభావం భారత్‌లో చమురు సంస్థల పై పడుతుంది. దిగుమతి వ్యయం పెరిగితే, దేశీయంగా పెట్రోల్ ధరలను స్థిరంగా ఉంచడం ప్రభుత్వానికి సవాలుగా మారుతుంది.
ప్రస్తుతానికి రష్యా నిర్ణయం వల్ల భారత్‌లో పెట్రోల్ దొరకదు అనే భయం అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.