సాహో టీజ‌ర్‌: స్టైల్, యాక్ష‌న్‌, రిచ్ నెస్‌

సాహో ఎలా ఉండ‌బోతోందో.. మ‌చ్చుక్కు చూపించేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో టీజ‌ర్ వ‌చ్చేసింది. వాళ్ల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు, ఆ మాట‌కొస్తే – వాటికి మంచి టీజ‌ర్‌ని క‌ట్ చేసి, ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేసేసింది సాహో టీమ్‌. సాహోలో ఏమేమి ఉంటాయ‌ని చిత్ర‌బృందం చెబుతుందో, ఏమేమి ఉండాల‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారో.. వాట‌న్నింటినీ పొందుప‌ర‌చి – టీజ‌ర్ తోనే విందు భోజ‌నం అందించేశారు. స్టైల్‌, యాక్ష‌న్‌, భారీద‌నం, ఛేజింగులు, బ్లాస్టింగులు… ఇవ‌న్నీ క‌లిపి తెర‌పై చూస్తున్న‌ది తెలుగు సినిమానా, హాలీవుడ్ సినిమానా? అనే ఆశ్చ‌ర్యం అనుమానం క‌ల‌గ‌చేసేలా ఉన్నాయి. టీజ‌ర్‌లో ప్ర‌తీ ఫ్రేమూ రిచ్‌గా, క‌ల‌ర్ ఫుల్‌గా తీశారు. ప్ర‌భాస్‌తో పాటు, క‌థానాయిక శ్ర‌ద్దాక‌పూర్‌తోనూ ఫైట్స్ చేయించారు. చివ‌ర్లో `డైహార్ట్ ఫ్యాన్స్‌` అంటూ ప్ర‌భాస్ అమాయ‌కంగా చెప్ప‌డం న‌చ్చుతుంది. `నాకెవ‌రూ లేరు` అనుకునే ఓ అమ్మాయి కోసం ఓ అబ్బాయి ఏం చేశాడ‌న్న‌ది `సాహో` సినిమా. ఈ టీజ‌ర్‌లో చెప్పిన పాయింట్ అదొక్క‌టే. తెర నిండా విల‌న్లు క‌నిపిస్తుండ‌డంతో, `సాహో`గా ప్ర‌భాస్ టార్గెట్ ఎవ‌రిపైన? అనే అనుమానం వేస్తుంది. ఎడారిలో ఫైట్లు, ఫారెన్ రోడ్ల‌పై ఛేజింగులు చూస్తుంటే – వెండి తెర‌పై ఈ సినిమా మ‌రో అద్భుతం సృష్టించ‌డం ఖాయ‌మ‌న్న న‌మ్మ‌కం క‌లుగుతోంది. ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న‌ది ఇంకా ఫిక్స్ కాలేదు. కాక‌పోతే టీజ‌ర్‌కి ఇచ్చిన రీ రికార్డింగ్ మాత్రం కొత్త‌గా వినిపిస్తోంది. మొత్తానికి.. సాహో అంచ‌నాల్ని నిల‌బెట్టాడు. ఇక వెండి తెర‌పై విందు భోజ‌నం ఆర‌గించ‌డ‌మే త‌రువాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.