వరుస హిట్లతో తన కెరీర్ని ఘనంగా ఆరంభించిన సాయిధరమ్ తేజ్.. ఆ తరవాత ఎందుకో స్లో అయ్యాడు. ‘విరూపాక్ష’తో తన బండి మళ్లీ పట్టాలెక్కింది. మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం తనని బాగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడిప్పుడే కోలుకొని మళ్లీ యాక్టీవ్ అవుతున్నాడు. ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. రోహిత్ దర్శకుడు. నిజంజన్ నిర్మాత. తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. దీని తరవాత చేయబోయే రెండు ప్రాజెక్టులు కూడా ఓకే అయ్యాయి. ఈసారి కూడా కొత్త దర్శకులతోనే పని చేయాలని తేజ్ నిర్ణయించుకొన్నాడు.
‘సేవ్ ది టైగర్స్’తో ఆకట్టుకొన్న దర్శకుడు తేజ కాకమాను. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కోసం ఓ కథ సిద్ధం చేశారు. ఇటీవలే ఇద్దరి మధ్యా భేటీ జరిగింది. తేజ్ కి ఈ కథ బాగా నచ్చడంతో పచ్చ జెండా ఊపేశాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించనుంది. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రావొచ్చు. యూవీ క్రియేషన్స్ లో తేజ్ హీరోగా మరో సినిమా రూపొందించే అవకాశాలు ఉన్నాయి. సిద్దూ అనే కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడని టాక్. అయితే ముందుగా తేజ సినిమానే మొదలు కానుంది. దేవాకట్టా కూడా తేజ్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇది వరకు ‘రిపబ్లిక్’ అనే సినిమా వచ్చింది. అది సరిగా ఆడలేదు. అయినా సరే.. దేవాపై నమ్మకంతో తేజా ఆయనతో పని చేయడానికి సిద్ధం అవుతున్నాడని టాక్.