సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ ఇది. దాదాపు రూ.100 కోట్లు అటూ ఇటుగా ఖర్చు చేస్తున్నారని టాక్. సెప్టెంబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అప్పుడెప్పుడో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. అందుకు గల కారణాలూ చెప్పింది. స్ట్రైక్ వల్ల షూటింగ్ ఆసల్యమైందని, సీజీ వర్క్లు కూడా పెండింగ్లో ఉన్నాయని అందుకే వాయిదా వేయాల్సివస్తోందని ప్రైమ్ షో నిర్మాణ సంస్థ ప్రకటించింది.
సెప్టెంబరు 25న ఈ సినిమా రావడం అసాధ్యం అని అందరికీ తెలుసు. ఎందుకంటే.. ఆ రోజు ఓజీ వస్తోంది. కాబట్టి.. తేజ్ ఆ ధైర్యం చేయడు. ఈ ప్రకటన ఏదో కాస్త ముందు వచ్చుంటే బాగుండేది. కాస్త లేట్ అయ్యింది. బడ్జెట్ సమస్యల వల్ల షూటింగ్ ఆగిపోయిందని, అందుకే ఈ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదని ఆమధ్య వార్తలొచ్చాయి. వాటిపై చిత్రబృందం ఈ రూపంలో క్లారిటీ ఇచ్చిందనుకోవాలి. సినిమా ఆలస్యమైనా, క్వాలిటీ విషయంలో రాజీ పడమని, లేట్ గా వచ్చినా, అందరికీ నచ్చే సినిమా, గుర్తిండిపోయే ప్రాజెక్ట్ ఇస్తామని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.
రోహిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్లు వేశారు. అందులోనే 90 శాతం షూటింగ్ జరపనున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ఫుటేజ్ పట్ల చిత్రబృందం సంతృప్తికరంగా ఉందని, అందుకే బడ్జెట్ పెరిగినా, వెనుకంజ వేయడం లేదని సమాచారం. 2025లో ఈ సినిమా వచ్చే అవకాశాలు తక్కువే. బహుశా.. 2026 వేసవిలో సంబరాల ఏటిగట్టు చూడొచ్చు.