రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన సాయి సూర్య డెవలపర్స్ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝుళిపించింది. నిందితుడు సతీష్ చంద్ర గుప్తా, అతని సంస్థకు చెందిన 14.63 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం జప్తు చేసింది. వివిధ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ప్లాట్లు విక్రయిస్తామని నమ్మించి, అనేక మంది బాధితుల నుంచి భారీగా వసూలు చేసిన నిధులతో ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
తెలంగాణ పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ విచారణను ప్రారంభించింది. సతీష్ చంద్ర గుప్తా బాధితుల నుంచి డబ్బు వసూలు చేసి, వారికి హామీ ఇచ్చిన విధంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసినట్లు పోలీసుల ఛార్జ్‌షీట్ పేర్కొంది. ఈ అక్రమాలకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం , 2002 కింద ఈడీ లోతైన దర్యాప్తు చేపట్టింది.
ఈడీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు పక్కా ప్రణాళికతో అనుమతులు లేని లేఅవుట్లను విక్రయించడం, ఒకే ప్లాట్‌ను పలువురికి అమ్మడం, చెల్లుబాటు కాని ఒప్పందాలతో డబ్బు వసూలు చేయడం వంటి మోసాలకు పాల్పడ్డారు. ప్రజలను వంచించాలనే ఉద్దేశంతోనే తప్పుడు హామీలు ఇచ్చి భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించినట్లు విచారణలో వెల్లడైంది. నేరం ద్వారా సంపాదించిన ఈ 14.63 కోట్ల రూపాయలను నిందితుడు తన కుటుంబ సభ్యులు , భాగస్వామ్య సంస్థల పేరుతో ఉన్న అనేక బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. నిధుల మూలాన్ని దాచేందుకు అంతర్గత బదిలీల ద్వారా ఈ డబ్బును లేయరింగ్ చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులోనే పలువురు సెలబ్రిటీలను కూడా ఈడీ విచారించింది. వారు ఈ సంస్థకు ప్రచారకర్తలుగా వ్యవహరించారు.
