‘హిట్’ ఫ్రాంచైజీ డబ్బులు కురిపిస్తోంది. హిట్ 1, 2 కంటే హిట్ 3 పెద్ద విజయాన్ని అందుకోనుంది. తొలి రెండు రోజుల వసూళ్లే ఆ విషయాన్ని చెబుతాయి. ఇప్పుడు అందరి దృష్టి హిట్ 4పై పడింది. హిట్ 3 కంటే పెద్ద స్థాయిలో ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు శైలేష్ కొలను హామీ ఇస్తున్నారు. కార్తీ ఈసారి హీరోగా మారడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ‘హిట్ 3’ క్లైమాక్స్ లో కార్తీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశాడు. ఆ కాసేపు స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్ని బ్లాస్ట్ చేసింది.
నిజానికి హిట్ 4 కథేమిటి? అనేది అస్సలు డిసైడ్ అవ్వలేదట. జస్ట్.. కార్తికి లైన్ మాత్రమే వినిపించార్ట. ‘సినిమా ఇలా ఉండబోతోంది.. ‘ అంటూ దర్శకుడు చూచాయిగా చెప్పాడట అంతే. కానీ కార్తి మాత్రం దర్శకుడ్ని, నానిని నమ్మి రంగంలోకి దిగిపోయారు. తెలుగులో స్ట్రయిట్ సినిమాలు చేయాలన్న ఉత్సాహంతో ఉన్నాడు కార్తి. ‘ఊపిరి’ తరవాత తనకు అలాంటి అవకాశం దొరకలేదు. ఈసారి ‘హిట్ 4’తో దాన్ని అందిపుచ్చుకొన్నాడు. అయితే ‘హిట్ 4’ ఇప్పుడే పట్టాలెక్కే అవకాశం లేదు. దీనికి ఇంకా టైమ్ ఉంది. హిట్ 3, 4 మధ్యలో శైలేష్ కొలను ఓ సినిమా చేయాలి. అన్నీ అనుకొన్నట్టు జరిగితే.. శైలేష్ వెంకీతో ఓ సినిమా చేస్తాడు. ఆ తరవాతే ‘హిట్ 4’ ఉండొచ్చు. త్వరలోనే శైలేష్ సిడ్నీ బయల్దేరుతున్నారు. అక్కడ ఆరు నెలలు విరామం తీసుకొంటున్నారు. ఆ విరామంలోనే ‘హిట్ 4’ కథ రాసుకొస్తార్ట. వచ్చాక.. ఏ సినిమా చేయాలి? ఎవరితో చేయాలి? అనే విషయాలపై ఓ నిర్ణయానికి వస్తారు.