సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఏపీలోనే రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకుంది. ఎలా చేయించుకుంది.. ఎవరు వెరిఫై చేశారన్న విషయం పక్కన పెడితే.. వీరి ఓట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పొన్నూరు నియోజకవర్గంలో ఈ కుటుంబం అంతా ఓట్లు నమోదు చేయించుకుంది. సజ్జల రామకృష్ణారెడ్డి..ఆయన భార్య, పుత్రరత్నం సజ్జల భార్గవ, ఆయన భార్య.. నలుగురు పేర్లూ పొన్నూరు ఓటర్ల జాబితాలో ఉన్నాయి. అదే సమయంలో మంగళగిరి ఓటర్ల జాబితాలోనూ ఉన్నాయి.
ఈ రెండు నియోజకవర్గాలతో సరి పెట్టారా లేకపోతే కడపలోనూ పెట్టించుకున్నారా.. తెలంగాణలో తీయించుకున్నారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఓటర్ల జాబితాలు ఇష్టం రాజ్యం అయిపోయాయి. ఓట్లు తీసేయడం.. కావాల్సినవారివి చేర్చుకోవడం.. చేశారు. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఓటు కోసం హైకోర్టుకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. కానీ సజ్జల కుటుంబానికి మాత్రం నియోజకవర్గానికి ఓ ఓటు నడుచుకుంటూ వచ్చేసింది. ఇదెలా సాధ్యమంటే.. అసలు ఓటర్ల జాబితాలను తారు మారు చేసే ప్రక్రియ అంతా.. క్యాంప్ ఆఫీస్ నుంచే జరుగుతోందన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. సజ్జల భార్గవను పొన్నూరు నుంచి బరిలోకి దించాలనేది సజ్జల రామకృృష్ణారెడ్డి ప్లాన్ . అందుకే ఆ నియోజకవర్గంలో ఓటు నమోదు చేయించారు.
మెల్లగా పొన్నూరుకు అభ్యర్థి లేరనే సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఉమ్మారెడ్డి అల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన కొడుక్కు.. గుంటూరు ఎంపీ టిక్కెట్ ఖరారు చేశారు. పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ నిరాకరిస్తున్నారు. అయితే మరో అభ్యర్థి ఎవరో తెలియడం లేదు.. చివరికి అది సజ్జల భార్గవే అవుతారని.. అందుకే ఆ నియోజకవర్గంలో ఓటు నమోదు చేయించుకున్నారని అంటున్నారు.