అమరావతిపై ఎంత ఘోరంగా కుట్రలు చేస్తున్నారో వైసీపీ కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి బయట పెట్టుకున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడం అంటే.. కృష్ణానదిలో పోసినట్లేనని ఆయన తాజాగా ప్రెస్మీట్ పెట్టి చెప్పుకొచ్చారు. అసలు లేని మావిగన్ గురించి ప్రజల్లో చర్చ జరుగుతోందని చెప్పుకుంటూ ఆయన అమరావతిపై విషం కక్కారు.
అమరావతి అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తున్నారని విమర్శించారు. ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాని చోట వేల కోట్లు కుమ్మరించడం వల్ల ప్రజలపై పెను ఆర్థిక భారం పడుతుందని ..పాడిందే పాట అన్నట్లుగా మరోసారి చెప్పారు. అమరావతిని గ్రాఫిక్స్ రాజధానిగా అభివర్ణించిన సజ్జల, ఇక్కడ పెడుతున్న పెట్టుబడులన్నీ కృష్ణానదిలో పోసినట్లే అని తన కుళ్లును బయట పెట్టుకున్నారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతంలో లక్షల కోట్లతో భవనాలు నిర్మించడం వల్ల ప్రయోజనం ఉండదని, అది రాష్ట్ర భవిష్యత్తును అప్పుల ఊబిలోకి నెట్టడమేనని అన్నారు.
అమరావతి విషయంలో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని, వాస్తవాలను దాచి సంబరాలు చేసుకోవాలని పిలవడంలో అర్థం లేదని సజ్జల విమర్శించారు. గతంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి ఇచ్చింది మట్టి, నీళ్లే అని తిట్టిన చంద్రబాబు, ఈరోజు అవే అద్భుతం అని చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. కేవలం కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాజధాని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నిజానికి అమరావతిలో పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. స్వయంగా కేంద్రం కూడా కార్యాలయాలు నిర్మస్తోంది. స్టార్ హోటల్స్ సహా పలు వాణిజ్య సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి నిర్మాణాలు చేపట్టాయి. కొత్తగా ఎవర్నీ రాకుండా మావిగన్ పేరుతో బెదిరించేందుకు సజ్జల తో పాటు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
