అసలు లిక్కర్ స్కామ్‌ను ఎలా నిరూపిస్తారు..? ప్రభుత్వానికి కార్పొరేషన్‌కు సంబంధం ఏమిటి..? అరెస్టు చేసి మహా అయితే యాభై అరవై రోజుల్లో జైల్లో పెట్టగలరు అంతే. అంతకు మించి ఏమీ ఉండదు.. అని వైఎస్ఆర్సీపీ ఆర్కిటెక్ట్.. కుట్రల చీఫ్ స్ట్రాటజిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని పరామర్శించిన తర్వాత బహిరంగంగా చెప్పిన మాటలు. స్కామ్ చేయడానికి వారికి వచ్చిన ధైర్యం కూడా అదే. తమ అధినేత జగన్ రెడ్డి బహిరంగ దోపిడీకి పాల్పడి..క్విడ్ ప్రో కో చేసి వేల కోట్లు వెనకేసినా ఏమీ పీకలేకపోయారు.. ఇక ఓన్లీ క్యాష్ లావాదేవీలు ఎక్కడ పట్టుకుంటారని ఆయన నమ్మకం. నేరగాళ్లకు సందు ఇస్తే వ్యవస్థల్ని ఎలా కించ పరుస్తారో ఇంత కంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది?
వేల కోట్ల దోపిడీకి 50, 60 రోజుల జైలు
నిర్భయంగా .. ప్రజల రక్త మాంసాలు పీల్చిన వ్యవహారంలో మహా అయితే యాభై, అరవై రోజుల జైలు తర్వాత ఏమీ ఉండదని ఓ అభిప్రాయానికి రాబట్టే.. ధైర్యంగా అంతా చేశారు. ఇదే విషయాన్ని వారు ముందే చర్చించుకుని ఉంటారు. దొరికినా సరే కొద్ది రోజులే జైలు తర్వాత దోపిడీ సొమ్ము అంతా యుధావిధిగా అనుభవించవచ్చు. ఆ డబ్బుతో ఏదైనా చేయవచ్చని వారు అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే స్కామ్ చేశారు. ఇప్పుడు దొరికిపోయాక అదే బహిరంగంగా చెబుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి ధీయరీలు స్కామ్ కు రూపకల్పన చేసేటప్పుడు ఎన్ని చెప్పారో కానీ.. కనీసం రాజకీయాల్లో విలువలు ఉంటాయని కూడా ఊహించలేకపోతున్నారు.
శిక్షలే పడవని.. పడినా జీవితం అయిపోయాకేనని బరి తెగింపు
భారతీయ న్యాయవ్యవస్థలో ఓ కేసులో శిక్షలు పడాలంటే. ..అంత చిన్న విషయం కాదు. పైగా జగన్ లాంటి కరుడుగట్టిన క్రిమినల్ మైండ్ ఉన్న వారికి ఇంకా చాలా సులువు. క్విడ్ ప్రో కో తో ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడిన జగన్ రెడ్డిని ఇంత కాలంలో ఏమీ చేయలేకపోయారు. ఆయన కేసుల ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. అంతేనా వివేకానందరెడ్డిని అత్యంత ఘోరంగా నరికి చంపితే.. ఇతరులపై నిందలేసి తప్పించుకున్నారు. తాను సీఎంగా ఉండి సీబీఐ విచారణ చేయనివ్వలేదు. నిందితుల్ని అరెస్టు చేయలేదు. అయినా దిలాసాగా ఉన్నారు. ఇవన్నీ చేసిన వ్యక్తి.. ఓ స్కాంలో అరెస్టు చేస్తారని ఎలా భయపడతారు?. అరెస్టు చేసినా కొద్ది రోజులేనని ఎందుకు అనుకోరు ?
వ్యవస్థలపై పైచేయి సాధిస్తున్న నేరగాళ్లు
వ్యవస్థలపై నేరగాళ్లు పై చేయి సాధించడం అంటే ఇదే. ఎన్ని అక్రమాలు చేసినా.. ఎన్ని దోపిడీలు చేసినా.. ఎన్ని హత్యలు చేసినా సరే తమకేమీ కాదని.. నిర్భయంగా కోర్టు ముందే నిలబడి చెప్పగలుగుతున్నారంటే అది చిన్న విషయం కాదు. పూర్తి స్థాయిలో బరి తెగింపు. తప్పు చేసిన వాళ్లను వ్యవస్థ వదిలి పెట్టదు. కానీ ఆ తప్పు నుంచి వారు పొందిన ప్రయోజనాలన్నీ వారి వద్దనే ఉంటున్నాయి. దోపిడీ చేసిన సొత్తును రికవరీ చేసి.. మరొకరు ఇలాంటి స్కామ్ చేయాలంటే భయపడేలా చేయాల్సి ఉంది. అది వ్యవస్థల చేతుల్లోనే ఉంది.