ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించడంతో ఉన్నతాధికారులకు స్థానచలనం తప్పలేదు. మొత్తం 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. హైదరాబాద్ పీసీగా ఉన్న సీవీ ఆనంద్ ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం గ్రేహౌండ్స్ లో ఉన్నారు. ఆయనను కూడా బదిలీ చేశారు కానీ సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు.
సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా రాక ముందు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. అప్పుడు ఆయన చేసిన ఎన్ కౌంటర్ల పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆయన తప్పిదం ఉన్నట్లుగా తేలిందని .. ఆయనపై చర్యలు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వానికి సూచనలు రావడంతో వెంటనే ఆయనను నేరుగా పోలీసు విధులకు సంబంధం లేని ఆర్టీసీ ఎండీ పోస్టులో నియమించారు. సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజకీయాల కోసం ఆయన పరిధి దాటి వ్యవహరించారు. 2019 ఎన్నికలకు ముందు డేటా చోరీ పేరుతో కథ నడిపింది ఈయనేనన్న ఆరోపణలు ఉన్నాయి.
అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్ , ఇప్పటి సీఎం రేవంత్ పై కూడా ఆయన చాలా చేశారు. అవన్నీ కాంగ్రెస్ నేతలకు తెలుసు. అయినప్పటికీ రేవంత్ సీఎం అయ్యాక.. సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగానే కొనసాగించారు. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ పీసీగా నియమించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. సజ్జనార్ వారి అభిమానాన్ని సంపాదించుకోవడంలో సిద్ధహస్తుడని పోలీసు శాఖలోనే సెటైర్లు వినిపిస్తున్నాయి.