టీడీపీ కార్య‌క్ర‌మాల‌పై సాక్షికి ఎందుకంత టెన్ష‌న్‌..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలతోపాటు… చేప‌ట్ట‌బోయే వాటిపై కూడా సాక్షి నిరంత‌రం నిఘా పెట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది! ప్ర‌తిప‌క్ష పార్టీ మీడియాగా వారి డ్యూటీ అది కాబ‌ట్టి, దాన్నెవ‌రూ త‌ప్ప‌బ‌ట్ట‌రు! కాక‌పోతే, జ‌ర‌గ‌బోయే కార్య‌క్ర‌మాల‌పై ముందే బుర‌ద చ‌ల్లుతూ విమ‌ర్శ‌లు చేసే విధంగా క‌థ‌నాలు రాస్తున్న తీరే ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది..! ఆ కార్య‌క్ర‌మాలు జ‌రిగిన త‌రువాత‌… వాటిలో విమ‌ర్శించాల్సిన కోణాలుంటే, క‌చ్చితంగా చెయ్యొచ్చు.ఇవాళ్టి సాక్షిలో… ఉపాధి హామీ నిధుల‌తో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ లు భారీ ఎత్తున ప్ర‌చారానికి శ్రీ‌కారం చుడుతున్నార‌ని ఓ క‌థ‌నం. ‘ముస్లింల ఓట్ల‌పై వ‌ల’ అంటూ మ‌రో క‌థ‌నం..!

ఉపాధి హామీ ప‌థ‌కం నిధుల‌తో భారీ ఎత్తున పోస్ట‌ర్లూ హోర్డింగులూ పెట్టేయ‌బోతున్నారూ… చంద్ర‌బాబు, నారా లోకేష్ ల‌ను గొప్ప పాల‌నాద‌క్షులుగా చూపించే ప్ర‌చారానికి సిద్ధ‌మౌతున్నార‌ని రాశారు. బ‌కాయిలున్న ఉపాధి హామీ నిధుల‌ను విడుద‌ల చెయ్య‌కుండా… ప్ర‌చారానికే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌న్నారు. చాలా గ్రామాల్లో ప్ర‌జ‌లు నిధుల విడుద‌ల కోసం ఎదురుచూస్తున్నార‌న్నారు. అలాంట‌ప్పుడు, సాక్షి ఫోక‌స్ ఎక్క‌డుండాలి… నిధుల విడుద‌ల కోసం ఎదురుచూస్తున్న ప్ర‌జ‌ల పాయింటాఫ్ వ్యూ నుంచి ప్రెజెంటేష‌న్ ఉండాలి. ప్ర‌జ‌ల వాయిస్ వినిపించాలి! అంతేగానీ, బోర్డులు పెట్టేసుకుంటున్నారు, ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేందుకు సిద్ధ‌మైపోయారు అంటూ క‌థ‌నం రాశారు.

నిజానికి, ఆ బోర్డులూ హోర్డింగులూ ఇంకా పెట్ట‌లేదు క‌దా! పెట్టిన‌నాడు వాటిపై లోసుగులు ఉంటే విమ‌ర్శ‌లు చెయ్యొచ్చు. అంతేకాదు, ఆ ప్ర‌చారం మొద‌లుపెట్టేలోపుగానే పెండింగ్ ఉన్న బ‌కాయిల‌ను విడుద‌ల చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోందేమో తెలీదు! ఒక‌వేళ ఆ ప‌ని చేశాక‌నే.. హోర్డింగులు, యాడ్స్ రిలీజ్ చేద్దామ‌ని ప్ర‌భుత్వం అనుకుంటే… ఈరోజున సాక్షి చేసిన విమ‌ర్శ‌లు ఏమౌతాయి..? అత్యుత్సాహం అయినట్టేగా.

ఇక‌, మ‌రో క‌థ‌నం ‘ముస్లింలపై ఓట్ల వ‌ల’ విష‌యానికొస్తే… ఈ నెల 28న గుంటూరులో ఓ కార్య‌క్ర‌మాన్ని టీడీపీ నిర్వ‌హించ‌నుంది. ఈ నేప‌థ్యంలో ముస్లింల‌కు చంద్ర‌బాబు స‌ర్కారు చేసిందేం లేద‌నీ, కేటాయించిన నిధుల‌ను కూడా ఖ‌ర్చు పెట్ట‌లేద‌నీ, దేశంలో ముస్లిం మంత్రి లేని ఏకైక క్యాబినెట్ చంద్ర‌బాబుదే అని రాశారు. అంటే, కేవ‌లం మంత్రి ప‌ద‌వి ద‌క్కితేనే ఆయా సామాజిక వ‌ర్గాల‌కు మేలు జ‌రిగిన‌ట్టా..? ఏపీలో మైనారిటీల కోసం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల గురించి ఈ క‌థనంలో ప్ర‌స్థావ‌న లేదు. ప‌ద‌వి ఇచ్చేస్తే చాలు… సంక్షేమం ఎలా ఉన్నా ఫ‌ర్వాలేద‌న్న‌ట్టుగా ఉంది సాక్షి వాద‌న‌. గుంటూరులో స‌భ జ‌ర‌క‌ముందే టీడీపీని ముస్లింలు ప్ర‌శ్నించేస్తున్నార‌నే అభిప్రాయాన్ని వెళ్ల‌గ‌క్కారు. ఒక‌వేళ అలాంటి అసంతృప్తి ఏద‌న్నా ఉంటే… ఆ స‌భ‌లో వారు ప్రభుత్వాన్ని ప్ర‌శ్నిస్తారు క‌దా, ఆ త‌రువాత సాక్షి వ‌కాల్తా పుచ్చుకుంటే అర్థ‌వంతంగా ఉంటుంది. ముస్లింలు చాలా అసంత్రుప్తిగా ఉన్నారని ఇవాళ్ల రాసేసి… రేపు గుంటూరు సభ దిగ్విజయంగా జరిగిందే అనుకుందాం. మరి, ఇవాళ్ల సాక్షి చేసిన విమర్శలు ఏమౌతాయి..? అత్సుత్సాహమే కదా.

టీడీపీ చేప‌ట్ట‌బోతున్న కార్య‌క్ర‌మాలు ఇంకా జ‌ర‌గ‌క‌ముందే సాక్షి స్పందించేస్తోంది! ఈ క్ర‌మంలో పార్టీ ప‌రంగా వారి ఆందోళ‌నే త‌ప్ప‌, ప్ర‌జ‌ల త‌ర‌ఫున స‌మ‌స్య‌ల కోణం నుంచి సాక్షి వాయిస్ ఉంటోంద‌న్న అభిప్రాయం ఏకోశానా క‌ల‌గ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com