సాక్షి మార్క్ : “మేఘా”పై కవరేజీ ఏది..?

వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా జర్నలిజానికి సరికొత్త అర్థం చెబుతోంది. తాను ఎవరిపైనైనా ఎలాంటి కథనాలు అయినా రాయవచ్చు కానీ.. తమ మీద మాత్రం ఈగ వాలకూడదని..వాదిస్తోంది. ఈ క్రమంలో సాక్షి మీడియా… ఒకే సారి జరుగుతున్న రెండు ఐటీ దాడుల ఘటనల్లో.. చేస్తున్న రిపోర్టింగ్ ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో తేలిపోతుంది.

“కల్కి” ఐటీదాడులపై చిలువలు, పలువలుగా కథనాలు..!

మూడు రోజులుగా.. చిత్తూరు జిల్లా వరదాయపాళ్యంలో ఉన్న కల్కి ఆశ్రమంతో పాటు పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు కల్కిభగవాన్, అమ్మ భగవాన్‌లు ప్రసిద్ధి పొందిన ఇద్దరు స్వామిజీ దంపతులు ఆ ఆశ్రమాలను నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుల్లో వారికి భారీ ఆశ్రమాలు, ఆస్తులు ఉన్నాయి. ఈ క్రమంలో ఐటీ దాడులు కలకలం రేపాయి. కల్కి, అమ్మ భగవాన్‌లు ఇద్దరూ అందుబాటులో లేరు. ఈ ఐటీదాడులపై సాక్షి పత్రిక.. విశ్వరూపం ప్రదర్శించింది. ఆధారాలు లేకుండా… వరుస కథనాలతో హోరెత్తించింది. ఆ కల్కి.. అలా అంట.. ఇలా అంట.. .అంటూ… వందలు, వేల కోట్ల ఆస్తుల అంచనాలతో ఆరోపణలు చేసేసింది. కల్కి భగవాన్‌ ఆశ్రమమే ఓ మిస్టరీ అని ప్రారంభించి.. ఆయనో ఓ సంఘ విద్రోహశక్తి అన్నట్లుగా.. చిత్రీకరించేసింది.

మేఘా కృష్ణారెడ్డిపై వారం రోజులుగా ఐటీ సోదాలు..! ఒక్క వార్త ఏది..?

కల్కి ఆశ్రమంపై దాడులు జరగడానికి నాలుగు రోజుల ముందే… బడా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వారం రోజుల నుంచి సోదాలు సాగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున బంగారం, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ఐటీ వర్గాలు అనధికారికంగా మీడియా ప్రతినిధులకు చెప్పాయి. సోదాలు ఇంకా జరుగుతున్నాయి. దేశ చరిత్రలో… ఓ కాంట్రాక్ట్ కంపెనీలో సోదాలకు ఐటీ అధికారులు ఇంత సమయం వెచ్చించిన సందర్భం లేదు. గుట్టు విప్పాల్సిన లావాదేవీల చిట్టా పెద్దగా ఉండటంతోనే ఇలా ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. కానీ.. సాక్షి పత్రికలో.. ఒక్కటంటే.. ఒక్క వార్త రాలేదు. కల్కి ఆశ్రమంలో ఐటీ దాడులను చిలువలు.. పలువలుగా రాశారు కానీ.. మేఘా కృష్ణారెడ్డి గురించి మాత్రం.. కనీస సమాచారం ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు.

మేఘా కృష్ణారెడ్డిపై గతంలో .. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అదే మేఘా కృష్ణారెడ్డి ప్రభుత్వం మారగానే వైసీపీకి ఆప్తుడయ్యారు. పోలవరం రివర్స్ టెండర్లు రూ. ఎనిమిది వందల కోట్లకు తక్కువకు వేశారు. ఆయన వైఎస్‌కు కూడా అత్యంత సన్నిహితుడు. సామాజిక వర్గ కోణంమలో… కృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆప్తుడయ్యారు. ఆయన సామాజికవర్గ పరంగా.. ఆయన ఇమేజ్‌ను కాపాడాలి కాబట్టి.. ఐటీ దాడుల విషయంలో మాత్రం.. సాక్షి సైలెంట్ అయిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో.. కల్కి అసలు పేరు విజయకుమార్‌ నాయుడు. అక్కడే తేడా కొట్టినట్లుగా ఉంది. అదే విజయ్ కుమార్ రెడ్డి అయితే.. లైట్ తీసుకునేవారనే సెటైర్లు సాక్షి కాంపౌండ్‌లోనే వినిపిస్తున్నాయి.

సొంత జర్నలిజం కోసం పత్రికలు… టీవీ చానల్స్ పెట్టుకున్న తర్వాత పక్కనోడి మీద బురదచల్లడానికి.. తమ బురద దాచి పెట్టుకోవడానికి తప్ప… జర్నలిజం.. ఇంక దేనికీ కొరగాకుండా చేస్తున్నారు. అలాంటి వాటిలో సాక్షి ముందు ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com